టాయిలెట్ల మెయింటెనెన్స్​  పట్టించుకోవట్లే

టాయిలెట్ల మెయింటెనెన్స్​  పట్టించుకోవట్లే

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ భారత్ లో భాగంగా బహిరంగ మల, మూత్ర విసర్జన లేకుండా చేసేందుకు గ్రేటర్‌ పరిధిలో అన్నిచోట్ల బల్దియా పబ్లిక్​ టాయిలెట్లు ఏర్పాటు చేసింది. మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ లోని అన్నిజోన్లలో  కలిపి 5,295 టాయిలెట్లు ఉన్నాయి. ఇందులో  5036 టాయిలెట్ల మెయింటెనెన్స్ ను పీఎఫ్​టీ పద్దతిలో జోనల్​ కమిషనర్లు ఏజేన్సీలకు అప్పగించారు. వీటి నిర్వహణ కోసం బల్దియా ఏజేన్సీలకు ఒక్కో టాయిలెట్​కు నెలకు రూ.4,000 చెల్లిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని టాయిలెట్ల నిర్వహణకు నెలకు రూ.2 కోట్లకుపై గానే ఖర్చు చేస్తుంది. అయినప్పటికీ టాయిలెట్​ఆర్జెంట్ ​అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కిలోమీటర్ల మేర కూడా టాయిలెట్లు లేకపోవడం, ఉన్న చోట యూజ్ లో లేకపోవడంతో అర్జెంట్​గా టాయిలెట్ వస్తే తిరిగి పే అండ్​ యూజ్​ టాయిలెట్లకు వెళ్లక తప్పడంలేదు. టాయిలెట్ల పేరుతో  కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని జీహెచ్ఎంసీ వృథా చేస్తుందని జనం మండిపడుతున్నారు. ఇంత ఖర్చు చేసినా ప్రయోజనం ఏంటని అంటున్నారు.   
పే అండ్​ యూజ్​ మాత్రమే..
గ్రేటర్​ లో  పే అండ్​ యూజ్​ టాయిలెట్లు మాత్రమే పని చేస్తున్నాయి. డబ్బులు పోయినా సరే అంటూ జనం కూడా వాటినే వినియోగిస్తున్నారు. ప్రధానంగా బస్టాప్ ల వద్ద ఉండే సులభ్​ కాంప్లెక్స్​లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్రీ టాయిలెట్లు ఏమాత్రం వినియోగించేందుకు వీలుగా లేవు. చాలా వాటిలో పైపులు పగిలిపోయి కనిపిస్తున్నాయి. కొన్ని టాయిలెట్లకు కనీసం డోర్​ లు కూడా లేవు. ​50 శాతానికిపైగా టాయిలెట్లలో వాటర్​ కూడా అందుబాటులో ఉండటంలేదు. ఇలాగైతే ప్రజలు వాటిని ఎలా వినియోగించాలి.
క్యూఆర్​ కోడ్​ ఏమైంది..
కమర్షియల్ ప్రాంతాల్లో రోజుకు నాలుగు సార్లు,  నాన్​ కమర్షియల్​ ఏరియాల్లోనైతే రోజుకు కనీసం మూడు సార్లు టాయిలెట్లను క్లీన్​చేయాల్సి ఉంటుంది. వాటి నిర్వహణను క్యూర్​కోడ్​ద్వారా చెక్​చేస్తామని బల్దియా అధికారులు చెబుతున్నారు. క్లీనింగ్​నీట్​గా చేయకపోతే ఏజెన్సీలకు ఫైన్లు కూడా వేస్తామని హెచ్చరించిన అధికారులు వాటి నిర్వహణను పట్టించుకోవడంలేదు. 
టాయిలెట్లు కనిపిస్తలేవు..
బల్దియా ఎన్నికలకు ముందు బస్టాపులు, ఫుట్​పాత్, పార్కులు ఇలా అన్నిచోట్ల టాయిలెట్లను ఏర్పాటు  చేశారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదు. దీనిపై అధికారులను అడిగితే లొకేషన్లు చేంజ్​చేసినట్లు చెబుతున్నారు. కానీ వేరే ప్రాంతాల్లో కూడా కనిపిపండం లేదు. ప్రస్తుతం గ్రేటర్​లో 30 మొబైల్​టాయిలెట్లు మాత్రమే పని చేస్తున్నాయి. అవి కూడా రద్దీ తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఉంటున్నాయి.