అదానీ, టాటాల రాకతో ఏవియేషన్ దశ మారుతుందా?

అదానీ, టాటాల రాకతో ఏవియేషన్ దశ మారుతుందా?
  • ఆకాశ, సరికొత్త ఎయిర్‌‌‌‌ ఇండియాతో పెరగనున్న కాంపిటీషన్
  • ఎయిర్ పోర్టుల సెగ్మెంట్ లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్
  • వచ్చే పదేళ్లలో రూ.3 లక్షల కోట్లకు ఎయిర్ లైన్ కంపెనీల రెవెన్యూ

బిజినెస్‌‌ డెస్క్‌‌, వెలుగు: ఒకప్పుడు  ఇండియన్  ఏవియేషన్ సెక్టార్ అనగానే   నరేష్‌‌ గోయల్‌‌ (జెట్‌‌ఎయిర్‌‌‌‌ వేస్‌‌), విజయ్‌‌మాల్యా (కింగ్‌‌ఫిషర్‌‌‌‌) మాత్రమే గుర్తొచ్చేవారు. పరిస్థితులు మారాయి. దేశ ఏవియేషన్ సెక్టార్‌‌‌‌లోకి  అదానీ గ్రూప్‌‌, టాటా గ్రూప్‌‌లు  ఎంటర్ అయ్యాయి. విస్తరిస్తున్నాయి. తాజాగా ఎయిర్‌‌‌‌ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌‌,  ఫ్లయిట్ సర్వీస్‌‌లలో టాప్‌‌లో ఉంది. ఎయిర్‌‌‌‌పోర్టులను మేనేజ్‌‌ చేయడంలో అదానీ గ్రూప్  విస్తరిస్తోంది. టాటా, అదానీ వంటి బాగా డబ్బున్న సంస్థలు ఏవియేషన్ సెక్టార్‌‌‌‌లోకి ఎంటర్ అవ్వడంతో ఈ ఇండస్ట్రీ రూపు రేఖలు మారిపోతాయని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.  2024 నాటికి  ప్రపంచలోనే మూడో  అతిపెద్ద ఏవియేషన్ సెక్టార్‌‌‌‌గా మన ఇండస్ట్రీ ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా  పెద్ద సంస్థలు రంగలోకి దిగితే ప్రభుత్వ పాలసీలలో కూడా మార్పులొస్తాయని భావిస్తున్నారు.  2004  టైమ్‌‌లో  దేశంలో లో–కాస్ట్ ఎయిర్‌‌‌‌లైన్ల మాటే లేదు. ఎయిర్‌‌‌‌ దక్కన్‌‌ను ఫౌండర్ జీఆర్‌‌‌‌ గోపినాథ్‌‌ సాయంతో  అప్పటి సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌‌‌‌ ప్రఫుల్ పటేల్‌‌ తీసుకున్న పాలసీలు  లో–కాస్ట్‌‌ ఎయిర్‌‌‌‌లైన్లకు బాటలు వేశాయి.  58 ఏళ్లకే రిటైర్ అయిన  పైలెట్లు 65 ఏళ్ల వరకు సర్వీస్‌‌లో ఉండేలా అప్పుడు ప్రభుత్వం రూల్స్ మార్చింది. అంతేకాకుండా ఎయిర్‌‌‌‌ఫోర్స్‌‌లో పనిచేసి రిటైర్ అయిన పైలెట్లు కూడా ఈ సర్వీస్‌‌లలో ఉండేలా అవకాశం ఇచ్చింది. పాలసీలలో మార్పులతో  ఇండిగో, స్పైస్‌‌జెట్‌‌, గోఫస్ట్‌‌ (ముందు గోఎయిర్‌‌‌‌) కంపెనీలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం దేశ ఏవియేషన్ మార్కెట్‌‌లో 80 శాతం వాటా దక్కించుకున్నాయి. కానీ, ఈ పాలసీల మార్పులు ఎప్పుడో 18 ఏళ్ల కిందట వచ్చాయి. మళ్లీ పాలసీలు మార్చాల్సిన టైమ్ వచ్చింది.  2003 లో దేశ ఏవియేషన్ సెక్టార్‌‌‌‌లో 135 ఫ్లయిట్లు, 1.2 కోట్ల మంది ప్యాసెంజర్ల ట్రాఫిక్ మాత్రమే ఉండేది. ప్రస్తుతం ఈ నెంబర్‌‌‌‌ 700 విమానాలకు, ఏకంగా 14.4 కోట్ల మంది ప్యాసెంజర్ల ట్రాఫిక్‌‌కు చేరుకుంది. కరోనాతో నష్టపోయిన ఈ ఇండస్ట్రీ,  ఇంకా ఎదగాలంటే అదానీ, టాటా గ్రూప్‌‌ వంటి బాగా డబ్బున్న సంస్థలు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది.

ఏవియేషన్ సెక్టార్ రెవెన్యూ రూ. లక్ష కోట్లు..

ఈటీ ప్రైమ్ ఎనాలసిస్ ప్రకారం, 2019–20 నాటికి దేశ ఎయిర్‌‌‌‌లైన్ కంపెనీల రెవెన్యూ రూ. లక్ష కోట్లకు చేరుకుంది. ఇందులో  రూ. 43,000 కోట్ల రెవెన్యూ  టాటా గ్రూప్‌‌ కంపెనీల నుంచే ఉంది. ఇందులో రూ.   34 వేల కోట్లు ఎయిర్‌‌‌‌ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ల నుంచి, రూ.5,000 కోట్లు విస్తారా నుంచి, రూ.   4,000 కోట్లు ఎయిర్ ఏషియా నుంచి జనరేట్ అయ్యాయి. ఇండిగో రూ. 36 వేల కోట్ల రెవెన్యూని సంపాదించగా, స్పైస్‌‌జెట్‌‌ రూ. 12,000 కోట్లు, గోఫస్ట్ రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని  సంపాదించాయి. ఇదే టైమ్‌‌లో ఎయిర్‌‌‌‌పోర్టుల సైజు కూడా పెరిగింది. దేశంలోని ఎయిర్‌‌‌‌పోర్టులు 2019–20 లో రూ. 24 వేల కోట్ల రెవెన్యూని సంపాదించాయి.  ఇందులో రూ. 11 వేల కోట్లు ఎయిర్‌‌‌‌పోర్ట్స్ అథారిటీ కి వచ్చింది. జీఎంఆర్‌‌‌‌కు  రూ. 6,000 కోట్లు, అదానీ ఎయిర్‌‌పోర్ట్స్‌‌కు రూ. 5,500 కోట్ల రెవెన్యూ వచ్చింది. పెద్ద కంపెనీలు రావడంతో   వచ్చే పదేళ్లలో ఎయిర్‌‌‌‌లైన్‌‌ కంపెనీల‌‌ రెవెన్యూ రూ. 3 లక్షల కోట్లకు, ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల రెవెన్యూ రూ. 75 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.  

కరోనా  ముందు ఉన్నట్టే రష్‌

వచ్చే రెండు మూడు నెలల్లో  డైలీ విమాన ప్రయాణికుల సంఖ్య కరోనా ముందు లెవెల్స్‌‌కు చేరుకుంటుందని ఏవియేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.  ఏవియేషన్‌‌ సెక్టార్ పుంజుకోవాలంటే రాష్ట్రాలు జెట్ ఫ్యూయల్స్‌‌పై ట్యాక్స్‌‌లు తగ్గించాలని కోరారు. కరోనాకు ముందు సగటున రోజుకి 4 లక్షల మంది విమాన ప్రయాణాలు చేసేవారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత డైలీ ప్యాసెంజర్ల సంఖ్య పుంజుకుంది. కానీ, కరోనా ఒమిక్రాన్‌తో మళ్లీ ఎయిర్‌‌ ట్రావెల్స్ తగ్గాయి. ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు తగ్గుతుండడంతో డైలీ ప్యాసెంజర్ల సంఖ్య  తిరిగి కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటోంది. డిసెంబర్‌‌‌‌లో డైలీ ప్యాసెంజర్ల సంఖ్య 3.8–3.9 లక్షలకు చేరుకుందని సింధియా ప్రకటించారు.

రేట్లు తగ్గుతాయా?

టాటా గ్రూప్‌‌, జున్‌‌జున్‌‌ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌‌‌‌లైన్‌‌లు    ఎంటర్ అవుతుండడంతో ఏవియేషన్ సెక్టార్‌‌‌‌లో కాంపిటేషన్ మరింతగా పెరుగుతుందని  జీఎంఆర్‌‌‌‌ ఎయిర్‌‌‌‌పోర్ట్స్‌‌  మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌‌‌ సిద్ధార్థ్‌‌ కపూర్ పేర్కొన్నారు. చాలా రూట్లలో ఎయిర్ ఇండియా ఫ్లయిట్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ‘ఢిల్లీ–మంగళూరు  మధ్య ఎయిర్ ఇండియా టికెట్ కాస్ట్ రూ. 10 వేలు. సేమ్ రూట్‌‌కే ఇండిగో రూ. 6 వేలు ఛార్జ్ చేస్తోంది. ఒకప్పుడు మార్కెట్‌‌లో పోటీ కోసం ఎయిర్ ఇండియా నడవలేదు. కానీ, టాటాల చేతికి వెళ్లడంతో ఇది మారొచ్చు’ అని ఆయన పేర్కొన్నారు. మరింత విస్తరించేందుకు వివిధ పాలసీలను సవరించాలని ఎయిర్‌‌‌‌పోర్టుల కంపెనీలు ప్రభుత్వాన్ని  కోరుతున్నాయి.  ఎయిర్‌‌‌‌పోర్టులలో డ్యూటీ ఫ్రీ షాప్‌‌ల నుంచి ఐదు బాటిళ్ల ఆల్కహాల్‌‌ను కొనుక్కోవడానికి అనుమతివ్వడం, సినిమా హాళ్లు, హౌసింగ్ కాలనీలు, మాల్స్‌‌, వేర్‌‌‌‌ హౌస్‌‌లు వంటివి ఎయిర్‌‌‌‌పోర్టులలో ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో ఎయిర్‌‌పోర్టుల రెవెన్యూ బాగా పెరుగుతుంది. పెద్ద కంపెనీలు ఎంటర్ అవ్వడంతో ప్రభుత్వ పాలసీలలో మార్పులొస్తాయని అంచనా.