జనంలో డబుల్ బెడ్రూం ఇళ్లపై గుస్సా

జనంలో డబుల్ బెడ్రూం ఇళ్లపై గుస్సా
  • నిరుద్యోగ భృతి, రుణమాఫీ మాటెత్తకపోవడంపై ఆగ్రహం

హైదరాబాద్, వెలుగురాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్​ బెడ్​రూం ఇండ్ల పథకం అమలు తీరుపై జనంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టీఆర్​ఎస్​ రెండో సారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా దాని గురించి పట్టించుకోవడం లేదని అంటున్నారు. మొదటి టర్మ్​ పాలనలోనే ఈ స్కీంను తీసుకువచ్చినప్పటికీ ఇప్పటివరకు దాన్ని వల్ల ప్రయోజనం చేకూరడం లేదని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అభిప్రాయం తీసుకోగా.. డబుల్​ బెడ్​రూం ఇండ్ల స్కీంపైనే 49.7 శాతం మంది అసృంతృప్తి వ్యక్తం చేశారు. దాని తర్వాత నిరుద్యోగ భృతిపై 38 శాతం మంది అసంతృప్తి వెలిబుచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైంలో ఈ స్కీంను మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్​ఎస్​.. మళ్లీ అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఊసెత్తడం లేదని జనం విమర్శిస్తున్నారు. ఈ రెండింటి తర్వాత రుణమాఫీపై 24 శాతం మంది అసంతృప్తి వెలిబుచ్చారు. ఇది అమలు కాకపోవడంతో బ్యాంకుల్లో లోన్లు పుట్టడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అటు తర్వాత వరుసగా గొర్రెల పంపిణీ తీరుపై 22.7శాతం మంది, మిషన్​ భగీరథపై 19.7 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికే ఆదర్శంగా మిషన్​ భగీరథ చేపట్టామని ప్రభుత్వం చెప్తున్నా.. దానివల్ల తమకు ప్రయోజనం దక్కడం లేదని చెప్పారు. తర్వాతి స్థానంలో దళితులకు మూడెకరాల భూ పంపిణీ (18.6%), రైతు బంధు (18.01%), కంటి వెలుగు (14.8%) వంటి పథకాలు సరిగా అమలుకావడం లేదన్నారు.

కల్యాణలక్ష్మి మంచిగున్నది

కల్యాణలక్ష్మి స్కీం అమలు తీరుపై జనం సంతృప్తి వ్యక్తం చేశారు. మంచిగా అమలవుతోందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అభిప్రాయం కోరగా.. కల్యాణలక్ష్మి స్కీం అమలు బాగుందని 59 శాతం మంది చెప్పారు. దీని వల్ల తమకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. అటు తర్వాత ఆసరా పెన్షన్ల పథకం నిలిచింది. ఈ స్కీంకు 46 శాతం మంది ఓటేశారు. ఈ రెండింటి తర్వాత వృద్ధాప్య పెన్షన్ల స్కీం, 24 గంటల కరెంట్‌‌ స్కీం మంచిగా అమలవుతున్నాయని 41 శాతం మంది తెలిపారు.  రైతు బంధుపై 35 శాతం మంది, రైతుబీమాపై 28 శాతం మంది, కంటివెలుగుపై 18 శాతం మంది సంతృప్తి వెలిబుచ్చారు. తర్వాతి స్థానాల్లో కేసీఆర్‌‌కిట్స్‌‌(17.9%), షాదీ ముబారక్‌‌(16.4), హరితహారం(15.9%) నిలిచాయి.

‘కంటి వెలుగు’పై భిన్నాభిప్రాయాలు

సీఎం కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం కంటి వెలుగు. తన నియోజకవర్గం గజ్వేల్​ నుంచే దీన్ని  ప్రారంభించారు. అయితే.. ఈ పథకంపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్కీం అమలు బాగుందని 18 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్లే తమ ఊరికి వచ్చి కంటి పరీక్షలు చేసి, మందులు ఇచ్చారని కొందరు జనం అంటున్నారు. అయితే ఇదే పథకంపై 14 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పరీక్షలు మాత్రమే చేసి ఇంటికి పంపారని, తర్వాత పట్టించుకోవడం లేదని సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు. ఉచిత కంటి ఆపరేషన్లు చేయిస్తామని చెప్పి ఇప్పటివరకూ మళ్లీ మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.