ఢిల్లీ స్లమ్‌లో అగ్ని ప్రమాదం..1500 గడిసెలు దగ్ధం

ఢిల్లీ స్లమ్‌లో అగ్ని ప్రమాదం..1500 గడిసెలు దగ్ధం
  • మంటలను అదుపుచేసిన 28 ఫైర్‌‌ ఇంజన్లు
  • ఫుట్‌వేర్‌‌ కంపెనీలోనూ ఎగసిపడ్డ మంటలు

న్యూఢిల్లీ: సౌత్‌ఈస్ట్‌ ఢిల్లీలోని తుగ్లక్‌బాద్‌ ఏరియాలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 1500 గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో వేలాది మంది ఇళ్లు కోల్పోయి రోడ్లపై పడ్డారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. “ అర్ధరాత్రి ఒంటిగంటకు సమాచారం వచ్చింది. వెంటనే స్పందించి మంటలను అదుపుచేశాం. జనమంతా నిద్రలో ఉన్నారు. కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో 28 ఫైర్‌‌ ఇంజన్లను వాడి తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో మంటలను అదుపుచేశాం” అని సౌత్‌ ఈస్ట్‌ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్‌‌ ఆఫ్‌ పోలీస్‌ ప్రసాద్‌ మీనా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నామని అన్నారు. నార్త్‌ వెస్ట్‌ ఢిల్లీలోని ఫుట్‌వేర్‌‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలో కూడా మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగిందని, దాదాపు 15 ఫైర్‌‌ ఇంజన్లతో మంటలు అదుపుచేశామని ఫైర్‌‌ అండ్‌ సేఫ్టీ అధికారులు చెప్పారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు.