- రాత్రంతా అంధకారం.. అగ్నికీలలతో భోలక్‌పూర్‌లో భయాందోళన
- నాలుగు ఫైరింజన్లతో మంటలార్పిన ఫైర్ సిబ్బంది
- ఇద్దరు చిన్నారులకు గాయాలు.. హాస్పిటల్‌కు తరలింపు
ముషీరాబాద్, వెలుగు: ముషీరాబాద్ పరిధిలోని భోలక్‌పూర్ గుల్షన్ నగర్లో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. కట్నీ కాంటా వద్ద మునీర్అనే వ్యక్తికి చెందిన స్క్రాప్ గోదాములో తొలుత మంటలు అంటుకొని పక్కనే ఉన్న మరో ఐదు గోదాములకు వ్యాపించాయి. దట్టమైన పొగ, మంటల కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న ముషీరాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి నాలుగు ఫైర్ ఇంజిన్లతో అర్ధరాత్రి వరకు శ్రమించి మంటలు అదుపు చేశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చుట్టుపక్కల అంధకారం నెలకొంది. ఇరుకైన వీధులు, ఫైర్ ఇంజిన్ల రాకపోకలు, స్థానికుల మోహరింపుతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
దట్టంగా వ్యాపించిన నల్లటి పొగలు, ఎగసిపడుతున్న మంటలతో అసలు ఏం జరుగుతుందో తెలియక స్థానికులు ఆందోళనలకు గురయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ రాంబాబు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ధైర్యం చెప్పారు.
దాదాపు రెండున్నర గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. దాదాపు రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని అంచనా. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స కోసం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు
