
- పాక్షికంగా దగ్ధమైన ఊంబ్ ఫెర్టిలిటీ దవాఖాన
- తప్పిన ప్రాణ నష్టం..
చందానగర్, వెలుగు: చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు షాపింగ్ మాల్స్ కు ప్రమాదశాత్తు మంటలు అంటుకొని పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే ఉన్న హాస్పిటల్‌కు కూడా మంటలు అంటుకోవడంతో పాక్షికంగా దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చందానగర్ లో జాతీయ రహదారి పక్కనే ఉన్న సెంట్రో ఫుట్‌వేర్ షాపింగ్ మాల్ నేమ్ బోర్డులో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
క్షణాల వ్యవధిలోనే మంటలు భవనంలోకి చేరడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీశారు. అగ్ని ప్రమాదంపై వెంటనే పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందజేశారు. సెంట్రో షాపింగ్‌మాల్‌లో భారీ మొత్తంలో ఫుట్‌వేర్ నిల్వలు ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడుతూ, పక్కనే ఉన్న ఆర్కే సిల్క్స్ షాపింగ్ మాల్ కు సైతం విస్తరించాయి. దీంతో ఆర్కే సిల్క్స్ భవనం కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైంది.
మంటలు అంతకంతకు పెరుగుతుండడంతో సెంట్రో భవనానికి మరో పక్కన ఉన్న ఊంబ్ ఫెర్టిలిటీ దవాఖానకు మంటలు అంటుకున్నాయి. అప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో.. దవాఖాన బయట వైపు ఉన్న ఏసీలు, ఇతర సామాగ్రి పాక్షికంగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగుతున్న సమయంలోనే అప్రమత్తమైన హాస్పిటల్ యాజమాన్యం అందులో ఉన్న రోగులను, సిబ్బందిని బయటకు తరలించారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
సెంట్రో భవనంలో ఇది రెండోసారి..
చందానగర్‌లోని సెంట్రో భవనంలో అగ్ని ప్రమాదం జరగడం ఇది రెండోసారి. గతంలో సైతం భారీ ఎత్తున అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో భవనం పూర్తిగా దగ్ధమైంది. భవనం స్లాబ్స్ తో పాటు పిల్లర్లు సైతం బలహీన పడినట్లు అధికారులు వెల్లడించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఫైర్ అధికారులను మేనేజ్ చేసి అదే బిల్డింగ్‌ను పునరుద్ధరించి మరోసారి సెంట్రో ఫుట్‌వేర్ షాప్ కొనసాగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల సైతం చూసి చూడనట్టుగా వ్యవహరించడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. సెంట్రోలో చెలరేగిన మంటల కారణంగా పక్కనే ఉన్న ఆర్కే సిల్క్స్ పూర్తిగా కాలిపోయిందని, మరో పక్కన ఉన్న హాస్పిటల్ పాక్షికంగా మంటలు వ్యాపించడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు.
ఆలస్యంగా చేరుకున్న ఫైర్ ఇంజిన్లు
హైవేపై ఉన్న భారీ భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెంది, పక్కనే ఉన్న మరో భవనాలకు సైతం అంటుకుంటున్న కూడా ఫైర్ ఇంజిన్లు మాత్రం ఆలస్యంగా వచ్చాయి. వచ్చిన వాటిలో సరిపడా నీళ్లు లేకపోవడంతో మంటలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. జీహెచ్ఎంసీ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని తెప్పించి ఫైర్ ఇంజిన్లు ద్వారా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఆలస్యంగా చేరుకున్న బాహుబలి ఫైర్ ఇంజిన్ (బ్రాంటో లిఫ్ట్), పదుల సంఖ్యలో ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు ఫైర్ అధికారులు పేర్కొన్నారు. ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
భారీగా ట్రాఫిక్ జామ్...
చందానగర్ ప్రధాన రహదారిపై శుక్రవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంతో రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకునే వీలు లేకుండా వాహనాలు కిలోమీటర్ మేరా నిలిచిపోయాయి. ప్రజల సైతం పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఫైర్ సేఫ్టీ సైతం జీరో
హైవేపై ఉన్న షాపింగ్ మాల్ లలో సైతం ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. నామమాత్రంగానే ఫైర్ పైపులను బిగించి ఉంచారని, ప్రమాదం జరుగుతుంటే ఫైర్ సేఫ్టీ ఆన్ అవ్వకపోవడంపై అనుమానంతో ప్రశ్నించగా, నామమాత్రంగానే ఉన్నాయని బదులిచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన అన్ని భవనాల్లో ఫైర్ సేఫ్టీ ఉంటే ఇంత మొత్తంలో నష్టం జరిగి ఉండేది కాదని ఫైర్ అధికారులతో పాటు స్థానికులు చెబుతున్నారు.