సెలబ్రిటీలకు మొండిచేయి .. టికెట్​ ఇవ్వని ప్రధాన పార్టీలు 

సెలబ్రిటీలకు మొండిచేయి .. టికెట్​ ఇవ్వని ప్రధాన పార్టీలు 

హైదరాబాద్, వెలుగు:  ప్రస్తుత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తారల తళుక్కులు కనిపించడం లేదు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సినిమా వాళ్లకు, వారి కుటుంబసభ్యులకు పెద్దగా టికెట్లు కేటాయించలేదు. కొంత మంది సినిమా యాక్టర్లు టికెట్లు ఆశించినా.. ఆయా పార్టీలు వారికి మొండిచేయి చూపాయి. అయితే, బీజేపీ నుంచి నటుడు బాబు మోహన్‌‌ మాత్రమే ఆందోల్‌‌ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తనకు టికెట్‌‌ ఇచ్చినా పోటీ చేయనని బాబు మోహన్‌‌ ప్రకటించారు. ఆ తర్వాత రెండ్రోజులకే బీజేపీ అభ్యర్థుల లిస్ట్‌‌ ప్రకటించగా, అందులో బాబు మోహన్‌‌కు టికెట్‌‌ కేటాయించారు. 

బీఆర్‌‌‌‌ఎస్ నుంచి టికెట్లు ఇయ్యలే..

అధికార బీఆర్‌‌‌‌ఎస్ నుంచి హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి 2014లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి సుమారు 21 వేల ఓట్లు సాధించారు. 2018లో అదే సీటు ఆశించినా టికెట్ దక్కలేదు. ఈసారి నాగర్జున సాగర్ టికెట్ ఆశించి, తన అల్లుడు అల్లు అర్జున్‌‌ను పిలిపించి ఫంక్షన్ హాల్ ఓపెనింగ్‌‌తో పాటు భారీ బలప్రదర్శన చేపట్టారు. అయినా, ఆయనకు బీఆర్‌‌‌‌ఎస్ టికెట్ ఇవ్వలేదు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి వేరే పార్టీలోకి వెళ్తారని పుకార్లు వినిపించాయి. మరోవైపు, నిజామాబాద్ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి నిర్మాత దిల్ రాజుకు టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా, బీఆర్‌‌‌‌ఎస్‌‌ టికెట్ కేటాయించలేదు. అయితే, ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 

కాంగ్రెస్‌‌లో నో టికెట్..

కాంగ్రెస్ నుంచి ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గోషామహాల్ నియోజకవర్గం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే, తాను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎలాంటి దరఖాస్తు పెట్టుకోలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. పాత బస్తీలో ఎంతో పేరు ఉన్న రాహుల్ సింప్లిగంజ్‌‌కు టికెట్ ఇస్తే రాజాసింగ్‌‌ను ఎదుర్కోవచ్చని కాంగ్రెస్‌‌ పార్టీ భావించినా.. అది కార్యరూపం దాల్చలేదు. మరోవైపు, కాంగ్రెస్‌‌ తరఫున నిజమాబాద్ జిల్లా నుంచి హీరో నితిన్ మామ నగేశ్‌‌ రెడ్డి టికెట్ ఆశించినా.. దక్కలేదు. 

బీజేపీలో ఒక్కరికే సీటు.. 

బీజేపీలో పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఉన్నా.. ఎవ్వరికీ టికెట్‌‌రాలేదు. కేవలం బాబు మోహన్‌‌ మాత్రమే టికెట్‌‌ కేటాయించారు. విజయశాంతి, జయసుధ, జీవితా రాజశేఖర్‌‌‌‌ బీజేపీ నుంచి టికెట్‌‌ ఆశించినా నిరాశే ఎదురైంది. విజయశాంతి ఎంతో కాలంగా బీజేపీలో యాక్టివ్‌‌గా పనిచేస్తున్నారు. ఆమె విషయంలో పార్టీ వ్యవహరించిన తీరుకు తీవ్ర మనస్తాపం చెందారు. మరోవైపు, పార్టీ స్టార్‌‌‌‌ క్యాంపెయినర్ లిస్టులో కూడా ఆమె పేరు పెట్టలేదు.

దీంతో పార్టీని టార్గెట్‌‌ చేస్తూ ఆమె ట్వీట్‌‌లు పెట్టడంతో, తప్పు గ్రహించి పార్టీ రాష్ట్ర నాయకత్వం స్టార్‌‌‌‌ క్యాంపెయినర్ లిస్టులో విజయశాంతి పేరును చేర్చింది. ఇది అవమానంగా భావించినా ఆమె ఇటీవల బీజేపీకి రాజీనామా చేశారు. మరోవైపు, రాజకీయాలకు దూరంగా ఉన్న జయసుధ ఇంటికి వెళ్లి తమ పార్టీలోకి రావాలని పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి కోరారు. దీంతో ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా, టికెట్ కేటాయించలేదు. జీవితా రాజశేఖర్ కూడా ఏకంగా నాలుగు సీట్లకు దరఖాస్తు చేసుకోగా, ఒక్క స్థానం నుంచి కూడా టికెట్‌‌ కేటాయించలేదు. మరోవైపు, బాబు మోహన్‌‌కు మొదటి జాబితాలో బీజేపీ టికెట్‌‌ కేటాయించలేదు.

ఆయనకు కాకుండా తన కుమారుడికి టికెట్ ఇస్తారని ఒక దశలో ప్రచారం జరిగింది. దీనిని అవమానంగా భావించిన బాబు మోహన్.. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌‌లో మీడియా సమావేశం పెట్టి, బీజేపీ తీరుపై మండిపడ్డారు. తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించారని, ఒకవేళ ఇప్పుడు టికెట్ కేటాయించినా పోటీ చేయనని స్పష్టం చేశారు. అవసరమైతే బీజేపీకి రాజీనామా చేస్తానని చెప్పారు. దీంతో ఆయనకు తర్వాతి జాబితాలో టికెట్‌‌ ఇచ్చారు. 

హీరోల మామలకు నిరాశ..

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్‌‌ను శంషాబాద్ నోవాటెల్‌‌కు పిలిపించుకొని, మాట్లాడారు. దీంతో బీజేపీ నుంచి నితిన్ పోటీ చేస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, అందులో ఎలాంటి నిజం లేదని తేలింది. నితిన్ మామ నగేశ్‌‌ రెడ్డికి కాంగ్రెస్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్‌‌‌‌ఎస్ నుంచి టికెట్ ఆశించినా నిరాశే ఎదురైంది. ఈ ఇద్దరికి టికెట్ కేటాయించి ఉంటే, నితిన్‌‌, అల్లు అర్జున్‌‌ ఆయా పార్టీల తరఫున ప్రచారానికి వచ్చే వారని, అప్పుడు ఆయా పార్టీలకు కొంత లాభం జరిగేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు, సినీ నటి రేష్మా రాథోడ్‌‌ 2014లో బీజేపీలో చేరి బీజేవైఎం నేతగా కొంత కాలం పనిచేశారు. 2018లో ఖమ్మం జిల్లాలోని వైరా ఎస్టీ సీటు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ, సుప్రీంకోర్టులో అడ్వకేట్‌‌గా పని చేస్తున్నారు.