బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖగారియా జిల్లాలోని పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఎస్‌యూవీ కారు, ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వెంటనే స్థానికులు ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖగారియా జిల్లాలోని తుట్టి మోహన్‌పూర్ గ్రామం నుండి మర్హయ్య బిత్లా గ్రామానికి పెళ్లికై ఓ కుటుంబం ఎస్ యూవీ కారులో వెళ్తొస్తుండగా ఎదురుగా వస్తున్న సిమెంట్‌తో వస్తున్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు స్పాట్ లోనే మృతి చెందారని గోగ్రీ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఖగారియా సదర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
