బెళగావిని యూటీ చేయండి : సంజయ్‌‌ రౌత్‌‌

బెళగావిని యూటీ చేయండి : సంజయ్‌‌ రౌత్‌‌
  • శివసేన (యూబీటీ) లీడర్‌‌‌‌ సంజయ్‌‌ రౌత్‌‌ డిమాండ్‌‌
  • బెళగావిలో దాడికి ఢిల్లీ మద్దతు ఉందని ఆరోపణ 

ముంబై: మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దు వివాదం కారణంగా బెళగావిని యూనియన్‌‌ టెరిటరీగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) లీడర్‌‌‌‌ సంజయ్‌‌ రౌత్‌‌ డిమాండ్‌‌ చేశారు. ఢిల్లీ మద్దతు లేకుండా బెళగావిలో హింసాత్మక ఘటనలు జరగవని ఆయన బుధవారం పేర్కొన్నారు. పక్క రాష్ట్రం చేసే దాడులను ఎదుర్కోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఫెయిలైందని సీఎం ఏక్‌‌నాథ్‌‌ షిండేపై మండిపడ్డారు. దాడుల్లో మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలను అరెస్ట్‌‌ చేయడంతో, మరాఠీల ఆత్మగౌరవం వెన్నువిరిచే ఆట మొదలైందన్నారు. ఈ కుట్రలో భాగంగానే బెళగావిలో దాడులు చేశారని, మరాఠాలమైన మనం ఇకనైనా నిద్ర లేవాలన్నారు. కేంద్రంలోనూ, కర్నాటకలోనూ, మహారాష్ట్రలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, అసలు ఏం జరుగుతుందో తమకు తెలియడం లేదన్నారు. మహారాష్ట్రను ఆర్థికంగా దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రాజెక్టులను గుజరాత్‌‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంజయ్‌‌ ఆరోపించారు. రాష్ట్రంలో గొడవలు జరుగుతుంటే సీఎం షిండే, డిప్యూటీ సీంఎ ఫడ్నవీస్‌‌ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రాల సరిహద్దు వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని లోక్‌‌సభలో ఎన్సీపీ లీడర్‌‌‌‌ సుప్రియా సూలే కోరారు. 

ప్రజలను రెచ్చగొట్టొద్దు..

ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సంజయ్‌‌ రౌత్‌‌కు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌‌‌‌ బవాన్‌‌కులే సూచించారు. కొంతమంది చేసే హింసకు ప్రభుత్వంఎలా బాధ్యత వహిస్తుందని ప్రశ్నించారు. సంజయ్‌‌... నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని మహారాష్ట్ర మంత్రి శంభురాజ్‌‌ దేశాయ్‌‌ హెచ్చరించారు.