గాలితో ఫుడ్డు.. CO2తో నీళ్లు, కరెంట్‌‌తో తయారు

గాలితో ఫుడ్డు.. CO2తో నీళ్లు, కరెంట్‌‌తో తయారు

మనం తినే బియ్యం, గోధుమలు, జొన్నల లాంటి ఆహారం ఎట్లా తయారైతది? గాలి, నీరు, భూమి, ఎరువులను వాడుకొని మొక్కలు ఉత్పత్తి చేస్తయి. ఇందులో ఏ ఒక్కటి అటూఇటైనా అంతే సంగతి. కానీ ‘అటూఇటూ’ అనే సమస్యే లేకుండా ఆహారం తయారైతే? అది కూడా కేవలం గాలి నుంచే తయారైతే? పైగా గాల్లోని కాలుష్య కారకంతో ఉత్పత్తి చేస్తే? మనకు కావాల్సిన పోషకాలు అందులో మస్తుగుంటే? ఇదే చేసి చూపించిందో కంపెనీ. గాలి నుంచి మాంచి  ప్రొటీన్‌‌ను తయారు చేసి ఆశ్చర్యపరిచింది. త్వరలో మార్కెట్‌‌లోకి తీసుకొస్తానంటోంది.

నాసా ఐడియా

ఫిన్‌‌లాండ్‌‌కు చెందిన సోలార్‌‌ ఫుడ్స్‌‌ కంపెనీ కేవలం గాలి నుంచి హై ప్రోటీన్‌‌ పౌడర్‌‌ ‘సోలిన్‌‌’ను తయారు చేసింది. నాసా సాయంతో కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌, నీరు, కరెంటుతో దీన్ని ఉత్పత్తి చేసింది. ఈ ఏక కణ సోలిన్‌‌లో 50 శాతం ప్రోటీన్‌‌, 5 నుంచి 10 శాతం కొవ్వు, 20 నుంచి 25 శాతం కార్బన్‌‌ ఉంటుందని చెప్పింది. చూడటానికి, రుచిలో గోధుమలా ఉంటుందని వివరించింది. 2021లో అందుబాటులోకి తీసుకొస్తామని, ఆ తర్వాత చాలా వరకు ఆహార పదార్థాలను దీనితోనే తయారు చేస్తారని ధీమాగా చెబుతోంది. తొలుత పెరుగు, ప్రోటీన్‌‌ షేక్‌‌ లాంటి పదార్థాలు మార్కెట్‌‌లోకి వస్తాయంది. సోలిన్‌‌ తయారీ ఐడియా ఫస్టు నాసాలో పుట్టిందని తెలిపింది.

సోలిన్‌‌ కార్బన్‌‌ న్యూట్రల్‌‌

మన చుట్టూ ఉన్న గాల్లో మస్తు కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ ఉందని, అది పెరిగే భూమి వేడెక్కుతోందని అందరికీ తెలుసు. ఇలాంటి కాలుష్య కారకమైన కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ నుంచే సోలిన్‌‌ను కంపెనీ రెడీ చేసింది. కార్బన్‌‌ క్యాప్చర్‌‌ టెక్నాలజీతో గాలి నుంచి కార్బన్‌‌ డై ఆక్సైడ్‌‌ను తీసుకొని నీరు, విటమిన్లు, పోషకాలు కలిపి సోలార్‌‌ కరెంటుతో సోలిన్‌‌ను తయారు చేస్తారు. అంటే ఇది పూర్తిగా కార్బన్‌‌ న్యూట్రల్‌‌ పద్ధతి. ఈస్ట్‌‌, లాక్టిక్‌‌ యాసిడ్‌‌ బ్యాక్టీరియాను తయారు చేసే సహజసిద్ధ కిణ్వన (ఫెర్మెంటేషన్‌‌) పద్ధతిలోనే ఇదీ జరుగుతుంది. సోలిన్‌‌ తయారీకి ఎలాంటి పరిమితులూ లేవని కంపెనీ చెప్పింది. అంటే సాధారణంగా పంటలు పండించడానికి కావాల్సిన భూమి, నీరు, వర్షం, మంచి వాతావరణం అవసరం లేదన్నమాట.

మాంసానికి బదులుగా?

వాతావరణ మార్పులు పెరగడానికి, కాలుష్యం ఎక్కువవడానికి, జంతువుల నివాస ప్రాంతాలు తగ్గడానికి, యాంటీ బయాటిక్‌‌లను తట్టుకొని వైరస్‌‌, బ్యాక్టీరియాలు పెరగడానికి పౌల్ట్రీ, ఫిష్‌‌, పోర్క్‌‌ లాంటి మాంసం ఇండస్ట్రీలు ముఖ్య కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ ఇండస్ట్రీ వల్ల జంతువులకు అవసరమైన గడ్డి పెంచేందుకు అడవులను నరకడం, సముద్ర ఫుడ్‌‌ చైన్‌‌ను నాశనం చేయడం, పశువులను ఫ్యాక్టరీ పద్ధతిలో పెంచడం, మాంసం కోసం పెంచే జంతువులకు భారీగా యాంటీ బయాటిక్స్‌‌ ఇవ్వడం లాంటివి పెరుగుతున్నాయని అంటున్నారు. అయితే పీ, సోయా ప్రొటీన్లతో చేసిన బీఫ్‌‌ ఫ్రీ బర్గర్లకు ఇప్పుడిప్పుడే మంచి డిమాండ్ పెరుగుతోందంటున్నారు. ఇప్పుడు సోలిన్‌‌ వీటన్నింటికీ పరిష్కారం చూపతుందని వివరిస్తున్నారు. అయితే జంతువుల అవసరం లేకుండానే కొన్ని కంపెనీలు మాంసాన్ని తయారు చేస్తున్నాయి. బియాండ్‌‌ మీట్‌‌, ఇంపాజిబుల్‌‌ ఫుడ్స్‌‌ కంపెనీలు ఇందులో ముందున్నాయి.

రూ. 8,500 కోట్ల వ్యాపారం

2021లో  సోలిన్‌‌ను మార్కెట్‌‌లోకి తీసుకొచ్చేందుకు సోలార్‌‌ ఫుడ్స్‌‌ రెడీ అవుతోంది. ఏటా 20 లక్షల ఆహార పదార్థాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023 నాటికి రూ.5,600 కోట్ల నుంచి రూ.8,500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. 2050 నాటికి 900 కోట్ల మందికి ఆహారం అందించాలనుకుంటోంది. ఈ సోలిన్‌‌ తయారీ ప్రాజెక్టు 2018లో స్టార్టయింది. ఈ ఏడాది మంచి ఫలితాలొచ్చాయి. ఈ ప్రొటీన్‌‌ను యూరోపియన్‌‌ ఫుడ్‌‌ సేఫ్టీ ఏజెన్సీలు ఓకే చేశాయి. దీంతో ఏడాదికి వెయ్యి టన్నుల సోలిన్‌‌తో 50 కోట్ల మీల్స్‌‌ రెడీ చేసే ఫ్యాకర్టీలు సిద్ధం చేయాలని భావిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయానికి పనికిరాని ప్రాంతాల్లో సోలిన్‌‌ లాంటి వాటిని తయారు చేయాలనుకుంటోంది.