
‘మధ్యాహ్నం మోదీ గారితో మీటింగ్ అయ్యింది. దేశ పరిపాలన మీద కొన్ని టిప్స్ ఇచ్చి వచ్చా’ అంటున్నారు వెంకటేష్. ఆయన హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రంలోని ‘సరదా సరదాగా’ అనే పాటను విడుదల చేయగా.. అందులో వెంకీ సరదాగా అన్న మాటలు ఇవి. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన ఈ పాటకు ‘ఎగిరే స్వప్నాలే మనం.. మనదే కాదా గగనం.. సిరివెన్నెలలో తడిసే గువ్వలం’ అంటూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాయగా, అనురాగ్ కులకర్ణి పాడాడు.
గుంటూరు కేఎల్ యూనివర్సిటీలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ ‘నా ముప్ఫై ఏడేళ్ల కెరీర్‌లో నేను నటించిన 75వ సినిమా ఇది. ఫ్యాన్స్ నాపై చూపిస్తున్న అభిమానానికి మరో పదిహేనేళ్లు సినిమాలు చేయొచ్చు అనిపిస్తుంది. ‘సైంధవ్’ అంటే సైకో. ఈసారి లెక్క మారుతుంది’ అని అన్నారు. దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ ‘ఫ్యామిలీతో పాటు యూత్‌కు నచ్చే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి.
ప్రేక్షకులను కచ్చితంగా డిజప్పాయింట్ చేయదు అని ప్రామిస్ చేస్తున్నా’ అన్నాడు. ఇందులో వెంకటేష్ గారిని డిఫరెంట్ అవతార్‌లో చూడొచ్చు అని చెప్పారు నిర్మాత వెంకట్ బోయనపల్లి. నవాజుద్దీన్ సిద్ధిఖీ, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, ఆర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదల కానుంది.