ఎడాపెడా అప్పులు చేస్తూ.. కేంద్రంపై నిందలా?

ఎడాపెడా అప్పులు చేస్తూ..  కేంద్రంపై నిందలా?

తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు. ఒకవైపు ఆస్తులను తెగనమ్ముతూనే.. మరోవైపు పరిమితికి మించి అప్పులు చేస్తోంది. ఇవి చాలవన్నట్టు మరిన్ని అప్పుల కోసం పాకులాడుతూ కేంద్రంపై నిందలు వేస్తోంది. రాష్ట్ర బడ్జెట్ విషయంలోనూ సర్కారు తీరు స్పష్టంగా తెలుస్తోంది. రెవెన్యూ మిగులు చూపించిన ప్రతీసారి అది లోటు అని తేలుతోంది. రాష్ట్ర అప్పులు 63 వేల కోట్ల నుంచి 4 లక్షల కోట్లకు చేరడం ఆందోళనకరం.

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. అప్పులు చేయడాన్ని కేసీఆర్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. 2014 రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్ర అప్పులు రూ. 63 వేల కోట్లు ఉంటే అది ఇప్పుడు 4 లక్షల కోట్లకు పెరిగింది. ఇవే కాకుండా మిషన్ భగీరథ, విద్యుత్ రంగం, సాగునీటి ప్రాజెక్టులు మొదలగు పథకాలకు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయో సర్కారు ప్రజలకు చెప్పాలె. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమతుల్యం ఎక్కడా కనిపించడం లేదు. కేంద్ర పన్నుల వాటాలో కోత పడిందంటున్న ప్రభుత్వం.. ఎంత వరకు కోత పడిందో స్పష్టం చేయాలి. కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని నిస్సహాయ స్థితిలో ఉండడం, కేంద్రానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపకపోవడం వంటి దయనీయమైన పరిస్థితులు రాష్ట్రంలో ఎందుకు ఉన్నాయో ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తమ వైఫల్యాలను కేంద్ర ప్రభుత్వంపై నెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

అంచనాలు తలకిందులు

టీఆర్ఎస్ ​ప్రభుత్వం 2019–-20 ఏడాదికి సంబంధించి ఫిబ్రవరిలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదిస్తూ  లక్షా 83 వేల కోట్లుగా ప్రకటించింది. సెప్టెంబర్ పూర్తిస్థాయి బడ్జెట్​లో ఒక లక్షా 45 వేల కోట్లకు దాన్ని కుదించింది. వాస్తవ ఖర్చును లక్షా 36 వేల కోట్లుగా బడ్జెట్​లో లెక్క చూపారు. 2020–-21 బడ్జెట్​లో కూడా లక్షా 82 వేల కోట్లు ప్రతిపాదించినా వాస్తవ రెవెన్యూ లక్ష కోట్లు దాటలేదు. 2021–-22 ఆర్థిక సంవత్సరానికి గానూ మొత్తం రూ. 2,30,825.96 కోట్లతో బడ్జెట్​ను ప్రవేశపెట్టగా.. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లు.. క్యాపిటల్ వ్యయం రూ. 29,046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లు.. ఆర్థిక లోటు రూ. 45,509.60 కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాలకు, వాస్తవిక ఆదాయానికి సుమారు రూ.50 వేల కోట్లు వ్యత్యాసం ఉంది. అంచనా వేసిన దాంట్లో 72.37 శాతం నిధులే సమకూరాయి. అంటే పాలక వర్గం అంచనాలు వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయో అర్థమవుతుంది. 2021-–22 ఏడాదిలో కేంద్రం నుంచి రూ.38,669.46 కోట్ల గ్రాంట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మార్చి నాటికి కేంద్రం రూ. 8,619.26 కోట్లే ఇచ్చింది. ఈ మొత్తం అంచనా వేసిన దాంట్లో 22.29 శాతమే. ఇలా వాస్తవికతను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్రం నుంచి అతిగా గ్రాంట్లను ఆశిస్తూ... ఆ తర్వాత చేతకానితనంతో కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపుతోంది. అంతకుముందు రెండు, మూడు బడ్జెట్​లలోనూ ఇదే రకంగా జరిగినా.. కనీసం పాఠాలు నేర్వని రాష్ట్ర సర్కారు.. కేంద్రంపై బురద చల్లడమే పనిగా 
పెట్టుకుంది. 

పన్నేతర రాబడిలోనూ..

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఖర్చు చేయక పక్కదారి పట్టిస్తోంది. చేసిన ఖర్చులకు యూసీలు సమర్పించదు. అవి సమర్పిస్తే మరిన్ని నిధులు వస్తాయి. అయినా పట్టించుకోదు. ఏమన్నా అంటే కేంద్రం ఇవ్వడం లేదని బద్నాం చేస్తుంది. భూముల అమ్మకం తదితర పన్నేతర రాబడుల కింద రూ.30,557.35 కోట్లు వస్తాయని ప్రభుత్వం బడ్జెట్​లో అంచనా వేసింది. కానీ, రూ.8,857.37 కోట్లు (28.99 శాతం) మాత్రమే సమకూరాయి. పన్నేతర రాబడులను భారీగా చూపించడం.. చివరకు అందులో నాలుగో వంతు కూడా రాకపోవడం ఏటా జరుగుతున్న తంతే. ప్రతి బడ్జెట్​దీ ఇదే తీరు. 

ఖర్చు అంతంతే..

రూ.1,98,430.21 కోట్లను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్​లో ప్రకటించింది. అయితే చేసింది మాత్రం రూ. 1,66,737.06 కోట్లే. అంటే దాదాపు రూ.32 వేల కోట్లను తగ్గించుకుంది. పెట్టిన ఖర్చుల్లోనూ మార్కెట్ రుణాల ద్వారా సేకరించిన నిధులే రూ.47,690.59 కోట్లు ఉన్నాయి. ఖర్చులు, రాబడుల విషయంలో ఎలా ఉన్నా.. అప్పుల విషయంలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగానే ఉంది. 2021-–22 బడ్జెట్​లో రూ.45.509.60 కోట్లను అప్పుగా తెస్తామన్న ప్రభుత్వం.. అనుకున్న దాని కంటే ఎక్కువే తెచ్చి ప్రజలపై భారం పెంచింది. 2021–-22 బడ్జెట్​లో రూ. 6,743.50 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేస్తే.. చివరికి రూ.10,163.96 కోట్ల లోటు అని తేలింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో మిగులు బడ్జెట్​గా ఉంది. ఆ మిగులు బడ్జెట్ కాస్తా సీఎం కేసీఆర్ ​ఇప్పుడు లోటు బడ్జెట్​గా మార్చారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. అంతకు ముందు ఏడాదీ రూ. 4 వేల కోట్లకు పైగా రెవెన్యూ మిగులు ఉంటుందని అంచనా వేస్తే.. ఏకంగా రూ.18వేల కోట్లకు పైగా లోటు తేలింది. 2021–-22 బడ్జెట్​లో ఉద్యోగుల వేతనాలకు రూ.30,375.10 కోట్లు, సర్వీసు పెన్షన్​దారుల పింఛన్ల కోసం రూ.14,027.98 కోట్లు, అప్పుల వడ్డీలకు రూ.18,688.18 కోట్లు, పథకాల సబ్సిడీల కోసం రూ.10,218.03 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు, ఇతర శాఖలకు ఏడాదంతా ఖర్చు చేసింది కేవలం రూ.50 వేల కోట్లు మాత్రమే కావడం గమనార్హం.

పేదలకు సొంతిండ్లు ఏవి?

రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడంతో వడ్డీలు పెరిగి పోయాయి. ప్రభుత్వం రుణమాఫీ చేయక, కొత్త అప్పు పుట్టక.. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోడీ ప్రభుత్వం తెలంగాణకు 2.90 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న టీఆర్ఎస్ సర్కార్.. ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. ఇతర రాష్ట్రాలు తొలి విడత మంజూరు చేసిన ఇండ్లను పూర్తి చేసి.. రెండో విడత.. మూడో విడత మరిన్ని ఇండ్లు మంజూరు చేయించుకుంటే.. తెలంగాణ మాత్రం ఇంకా తొలి విడత మంజూరైన ఇండ్లనే పూర్తి చేయలేదు. సీఎం కేసీఆర్​కు ఆ సోయి లేదు. ప్రభుత్వం కరెంటు చార్జీలు పెంచి పేదలపై తీవ్ర భారం మోపింది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించడం లేదు. వాహనాలకు లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్ కూడా పెంచింది. ధనిక రాష్ట్రం అని గొప్పలు చెప్పడమే కానీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకటో తారీఖు పడాల్సిన జీతాలు నెలలో 28 తేదీ దాటినా పడే పరిస్థితి లేదు. ఆసరా పెన్షన్లదీ అదే పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్లులన్నీ సర్కారు పెండింగులోనే పెడుతోంది. పారిశుద్ధ్య కార్మికులు జీతాల కోసం ఇటీవల మునుగోడు గ్రామ సర్పంచ్ భిక్షాటన చేయడం.. గ్రామ పంచాయతీల దుస్థితికి అద్దం పడుతోంది. అంగన్ వాడీ బిల్లులు.. ఆరోగ్య శ్రీ బిల్లులు.. మధ్యాహ్న భోజనం బిల్లులు పెండింగ్ ఇలా అన్నీ పెండింగ్​లో పెట్టి నెట్టుకొస్తోంది. ధాన్యం కొనుగోళ్ల విషయంలోనూ అంతే... రైస్ మిల్లర్లతో కుమ్మక్కై.. ఓసారి కొంటామని.. మరోసారి కొనమని... కొనుగోలు కేంద్రాలు తెరవక.. తెరిచిన వాటిలో సదుపాయాలు లేక.. తరుగు, తేమ పేరుతో తక్కువ జోకుతూ.. రైతుల ఉసురు పోసుకుంటోంది.

సంక్షేమంపై పట్టింపేది?

రాష్ట్రంలో11లక్షల మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. మూడేండ్ల నుంచి వీరి దరఖాస్తులు పెండింగ్​లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోవట్లేదు. పెన్షన్​ ఇస్తున్నామని గొప్పగా చెప్పుకునే టీఆర్ఎస్ సర్కార్ కొత్తవాళ్లకెందుకు పెన్షన్లు ఇవ్వదు? 57 ఏండ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్లు​ఇస్తామన్నారు.. అదీ మరచిపోయారు. 57 ఏండ్లు నిండిన వారి విషయం పక్కన పెడితే.. 65 ఏళ్లు నిండి వృద్ధాప్య పెన్షన్​కు అప్లై చేసుకున్న వారికే దిక్కు లేకుండా పోయింది. ఉద్యోగాల భర్తీలోనూ ఇదే పరిస్థితి. ఇటీవల అత్తెసరు నోటిఫికేషన్లు వచ్చినా.. అభ్యర్థులకు నియామక పత్రాలు చేతికి అందే వరకు డౌటే. నిరుద్యోగ భృతి ఇస్తామని టీఆర్​ఎస్​ 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది. ఇంతవరకు ఆ ముచ్చటే లేదు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్​ల కోసం కేంద్రం రూ. 245 కోట్లు రాష్ట్రానికి విడుదల చేసింది. దానికి రాష్ట్రం 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేస్తే స్కాలర్​షిప్​లు ఇవ్వొచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్​షిప్​లు నిలిచిపోయాయి. టీఆర్ఎస్ క్షుద్ర రాజకీయాల కారణంగా రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది పేదలు నష్టపోతున్నారు.

- డా. కె. లక్ష్మణ్, 
 బీజేపీ, ఓబీసీ మోర్చా  జాతీయ అధ్యక్షులు