
- రాష్ట్రంలోని తాజా పరిణామాలను ఖర్గేకు వివరించాం: మహేశ్కుమార్ గౌడ్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో రాష్ట్ర సర్కారు వేసిన పిటిషన్‌లో పార్టీ నాయకులు కూడా ఇంప్లీడ్ అవుతారని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో ఎలా వ్యవహరించాలనేదానిపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలతో జూమ్ మీటింగ్ జరిగిందని వెల్లడించారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పేస్‌మేకర్ అమర్చగా.. సోమవారం ఢిల్లీ రాజాజీ మార్గ్‌లోని నివాసంలో ఖర్గేను కలిసి, పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేశ్‌కుమార్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలను ఖర్గేకు వివరించినట్లు తెలిపారు. బీసీల రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి హైకోర్టులో జరిగిన వ్యవహారాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ రాష్ట్రంలో చేపట్టిన కుల గణన నుంచి జీవో వరకు అన్ని అంశాలను మరోసారి గుర్తు చేసినట్టు తెలిపారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై హైకోర్టు స్టే విధించినందున.. ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలనుకుంటున్న విషయాన్ని కూడా ఖర్గేకు తెలిపినట్లు వెల్లడించారు. కాగా, మంత్రుల మధ్య వివాదాలు చిన్న అంశం అని మహేశ్‌గౌడ్ కొట్టిపారేశారు. ఇది కుటుంబంలోని సమస్య అని, కాంగ్రెస్ నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఖర్గేను కలిసిన వారిలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, తదితరులు ఉన్నారు.