
- పారదర్శకంగా డీసీసీ ఎన్నిక
- ఏఐసీసీ ప్రతినిధి అజయ్ సింగ్
ఖానాపూర్, వెలుగు: పార్టీ కార్యకర్తల కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిందని ఏఐసీసీ ప్రతినిధి అజయ్ సింగ్ అన్నారు. డీసీసీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు అధ్యక్షత సోమవారం ఖానాపూర్ లో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహించారు. చీఫ్‌గెస్ట్‌గా హాజరైన అజయ్ సింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ను ప్రతి గ్రామంలో బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. మతం పేరిట ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. త్వరలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొంది అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు తప్పకుండా పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తల అభిప్రాయల మేరకే డీసీసీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, పీసీసీ పరిశీలకుడు మిద్దెల జితేందర్ , కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ రాంభూపాల్ రావ్, లకావత్ ధన్వంతి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గంగాభవాని, మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, నిమ్మల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.