
- మాల ఐక్య సంఘాల ఆరోపణ
బషీర్బాగ్,వెలుగు: ఎస్సీ వర్గీకరణను అస్తవ్యస్తంగా చేసి, రోస్టర్ పాయింట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాల, మాల అనుబంధ కులాలను అణిచివేసిందని నేషనల్ అంబేద్కర్ సేన, మాల ఐక్య సంఘాలు ఆరోపించాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నే శ్రీధర్ మాట్లాడారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపులో మాలలకు తీవ్రమైన నష్టం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
మాల పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ మంచాల లింగస్వామి మాట్లాడుతూ.. జీవో 10, 99లను సవరించాలని డిమాండ్ చేశారు. మాలల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరణం కిషన్, నేషనల్ అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షుడు తాలుకా రాజేశ్, ఆల్ ఇండియా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ యూత్ ప్రెసిడెంట్ దాసరి విశాల్ పాల్గొన్నారు.
ముషీరాబాద్: జీవో 99 వల్ల ఎస్సీల్లోని 58 ఉపకులాల వారు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అణిచివేతకు గురవుతారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పేర్కొంది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆ జీవోను రద్దు చేయాలని కోరింది. మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, బేర బాలకిషన్, డాక్టర్ వీరస్వామి నేతృతంలో సోమవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.