- మాదిగ సోదరులు విష ప్రచారం చేయొద్దు
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య
పంజాగుట్ట, వెలుగు : కాంగ్రెస్‌పార్టీ మాలలకు రెండు లోక్‌సభ టికెట్లు ఇస్తే మాదిగ సంఘాలు విమర్శించడం ఏమాత్రం కరెక్ట్కాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య అన్నారు. పదేండ్లుగా తెలంగాణ నుంచి మాలలు ఎవరూ పార్లమెంట్‌సభ్యులుగా లేరని చెప్పారు. రాష్ట్ర జనాభాలో మాదిగలు అధిక శాతం ఉన్నారంటూ ఆయా సంఘాలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక్కసారి జనాభా లెక్కలు తీస్తే.. మాల, మాదిగల సంఖ్య ఎంతో తేలిపోతుందన్నారు.
చెన్నయ్య శనివారం బంజారాహిల్స్‌లోని మాల మహానాడు హెడ్డాఫీసులో మీడియాతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మాలలు అధిక సంఖ్యలో ఉన్నారని, ఆ విషయాన్ని గుర్తించకుండా మాదిగ సోదరులు విష ప్రచారం చేయడం కరెక్ట్‌కాదన్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకే ఎక్కువ సీట్లు ఇస్తూ వచ్చాయని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మాల, మాదిగల జనాభా సమానంగా ఉంటుందని, పెద్దపల్లిలో మాలలు, మాల ఉప కులాల జనాభా మాదిగల కంటే ఎక్కువ ఉంటుందని మాల సంఘాల జేఏసీ వర్కింగ్చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపూజ రమేశ్, మన్నె శ్రీధర్‌రావు ఈ సందర్భంగా తెలిపారు.
