మాల వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావం: లోగో ఆవిష్కరించిన చైర్మన్ జి.చెన్నయ్య

మాల వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావం: లోగో ఆవిష్కరించిన చైర్మన్ జి.చెన్నయ్య

బషీర్​బాగ్, వెలుగు: పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, మహిళలకు చేయూత, యువతకు ఉపాధి శిక్షణ అందించడమే లక్ష్యంగా మాల కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎంసీడబ్ల్యూఏ) ఆవిర్భవించింది. గురువారం బషీర్​బాగ్ ప్రెస్ క్లబ్​లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, ఎంసీడబ్ల్యూఏ చైర్మన్ జి. చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. విజయ్ కుమార్ కలిసి లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ సంక్షేమం, విద్య, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని వివరించారు.

అన్ని వర్గాలకు సేవలు అందిస్తామని, పేద విద్యార్థులకు ఆర్థిక సహాయంతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పిస్తామని, మహిళలు, యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి స్వావలంబనకు చేయూత అందిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో సంస్థను మరింత బలోపేతం చేసి మహిళ సాధికారత సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్, నాయకులు సుధాకర్, రమేష్, అంజలి, లలిత, నరసింహ తదితరులు పాల్గొన్నారు.