మలాన్‌, మోర్గాన్ పరుగుల మోత

మలాన్‌, మోర్గాన్ పరుగుల మోత

నేపియర్‌‌ (న్యూజిలాండ్‌‌): డేవిడ్‌‌ మలాన్‌‌ (51 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 నాటౌట్) మెరుపు సెంచరీకి తోడు కెప్టెన్‌‌ ఇయాన్‌‌ మోర్గాన్‌‌ (41 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 91) ధనాధన్‌‌ బ్యాటింగ్‌‌తో చెలరేగడంతో టీ20  ఫార్మాట్‌‌లో తమ హైయెస్ట్‌‌ స్కోరు నమోదు చేసిన ఇంగ్లండ్‌‌ నాలుగో మ్యాచ్‌‌లో న్యూజిలాండ్‌‌ను చిత్తుగా ఓడించింది. ఐదు టీ20 మ్యాచ్‌‌ల సిరీస్‌‌ను 2–2తో సమం చేసి సిరీస్‌‌ రేసులో నిలిచింది. శుక్రవారం పలు రికార్డులు బద్దలైన ఈ మ్యాచ్‌‌లో టాస్‌‌ ఓడి మొదట బ్యాటింగ్‌‌ చేసిన ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 241 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ ఫార్మాట్‌‌లో ఇంగ్లండ్‌‌కు ఇదే టాప్‌‌ స్కోర్‌‌. 2016లో సౌతాఫ్రికాపై చేసిన 230/8 రన్స్‌‌ ఇప్పటిదాకా ఆ జట్టుకు అత్యుత్తమం. కివీస్‌‌ బౌలర్లలో శాంట్నర్‌‌ రెండు వికెట్లు పడగొట్టగా, టిమ్‌‌ సౌథీ ఒక వికెట్‌‌తీశాడు. అనంతరం ఛేజింగ్‌‌లో హోమ్‌‌టీమ్‌‌ ఏ దశలోనూ విజయానికి చేరువ కాలేకపోయింది. మాట్‌‌ పార్కిన్సన్‌‌ (4/47), క్రిస్‌‌ జోర్డాన్‌‌ (2/24) దెబ్బకు విలవిల్లాడిన కివీస్‌‌ 16.5 ఓవర్లలో 165 రన్స్‌‌కే ఆలౌటై చిత్తుగా ఓడింది. కెప్టెన్‌‌ టిమ్‌‌ సౌథీ (39), కొలిన్‌‌ మన్రో (30), మార్టిన్‌‌ గప్టిల్‌‌ (27) మినహా మిగతా బ్యాట్స్‌‌మెన్‌‌ విఫలమయ్యారు.

అంతకుముందు ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌‌లో జానీ బెయిర్‌‌స్టో (8) నిరాశ పరిచినా.. మరో ఓపెనర్‌‌ టామ్‌‌ బాంటన్‌‌ (31) ఫర్వాలేదనిపించాడు. అయితే, 58 రన్స్‌‌కే ఈ ఇద్దరూ ఔటైన దశలో జతకలిసిన మలాన్‌‌, మోర్గాన్‌‌ ఆకాశమే హద్దులగా చెలరేగారు. పోటాపోటీగా ఫోర్లు, సిక్సర్లు బాదేస్తూ.. కివీస్‌‌ బౌలింగ్‌‌ను ఊచకోత కోశారు. ఈ క్రమంలో 48 బాల్స్‌‌లో వంద మార్కు దాటిన మలాన్‌‌.. టీ20ల్లో ఇంగ్లండ్‌‌ తరఫున ఫాస్టెస్ట్‌‌ సెంచరీ చేశాడు. కొద్దిలో సెంచరీ చేజార్చుకున్న మోర్గాన్‌‌ 23 బాల్స్‌‌లోనే హాఫ్‌‌ సెంచరీ బాదేసి.. తమ జట్టు తరఫున ఫాస్టెస్‌‌ హాఫ్‌‌ సెంచరీ నమోదు చేశాడు. అలాగే, మూడో వికెట్‌‌కు మలాన్‌‌, మోర్గాన్‌‌ జతచేసిన 182 రన్స్‌‌ ఇంగ్లండ్‌‌ తరఫున ఏ వికెట్‌‌కైనా బెస్ట్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌. టీ20ల్లో ఓవరాల్‌‌గా నాలుగో అత్యుత్తమం. కాగా, సిరీస్‌‌ విజేతను తేల్చే ఐదో, ఆఖరి టీ20 ఆక్లాండ్‌‌లో ఆదివారం జరగనుంది.