దళితబంధు స్కీంలో మాలలకు అన్యాయం జరుగుతోంది : చెన్నయ్య

దళితబంధు స్కీంలో మాలలకు అన్యాయం జరుగుతోంది :  చెన్నయ్య

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

ఖైరతాబాద్, వెలుగు: దళితబంధు స్కీంలో మాలలకు అన్యాయం జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆరోపించారు. మాల, మాదిగలకు సమాన వాటా ఇవ్వాలని కోరారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో అంసా(ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రపంచాన్ని పరిపాలించే సత్తా ఉన్న మాలల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలపై సరైన అవగాహన లేక నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని చనిపోయినా పట్టించుకునే నాథుడు లేరని బాధపడ్డారు. మాలలకు కుల వృత్తి లేక, ఆర్థిక ఇబ్బందులతో గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. 

మాదిగలతో సమానంగా అన్ని సంక్షేమ పథకాలను అనుభవించేలా మాల సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. అసోసియేషన్ అధ్యక్షుడు మందాల భాస్కర్ మాట్లాడుతూ మాలలు కేవలం దళిత బంధులోనే కాదు, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లోనూ తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధుపై అవగాహన కల్పించేందుకు మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మాలలను ఏకం చేసి దళితబంధులో వాటాపై ఉద్యమిస్తామని ప్రకటించారు. మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దళితులకు అందుతున్న అన్ని పథకాలను ఆపేసి, కేవలం దళితబంధుకు కేటాయిస్తున్నారని, ఇది కరెక్ట్​కాదన్నారు. ఈ స్కీం పూర్తిగా దళారుల చేతిలో బందీ అయిందని మండిపడ్డారు.