
ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ సంఖ్యలో ఉన్న కులం మాల కులమని.. హక్కుల కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ‘‘మాలల సంఖ్య అంత ఉందా.. వారికి అంత ధైర్యం ఉందా.. ప్రభుత్వాన్ని ప్రభావితం చేస్తారా’’ అని ప్రభుత్వాలు, నాయకులు చూస్తున్నారని.. మాలలను ఏకథాటిపైకి తీసుకొచ్చి సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. ‘తిరుపతి మాలల ఆత్మీయ సభ’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతిలో.. ఈ ప్రాంతంలో మాలల సంఖ్య ఎక్కువగా ఉందని.. ఇలాంటి మీటింగ్ లలో అందరూ పాల్గొని.. ప్రభుత్వాలకు బలమైన మెసేజ్ పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే మాలలకు అన్యాయం చేయవద్దు అని ప్రభుత్వాలు భావిస్తాయని అన్నారు. మాలలు ఐక్యంగా ఏకథాటిపైకి రావాల్సిన అవసరం ఉందని, నాయకత్వ బాధ్యత ఎవరైనా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల స్పందన ఉన్నప్పుడే నాయకత్వం వస్తుందని చెప్పారు.
మాలల హక్కులు, ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతుంటే తనను సస్పెండ్ చేయమని చాలా మంది డిమాండ్ చేశారని.. కానీ మాల జాతి కోసం బయటికి వస్తానని చెప్పి బయలుదేరానని అన్నారు. జాతి కోసం కొట్లాడేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ అన్నారు.
మాలలు ఐక్యంగా ఉండాలని.. ఐక్యంగా పోరాటం చేసి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వివేక్ సూచించారు. మాలలు చాలా అసోసియేషన్ లు పెట్టుకుని ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారని, అందరూ ఏకథాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ మీటింగ్ తో అందరినీ ఏకథాటిపైకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఆ సభ ద్వారా మాలల సంఖ్య, సత్తా ఏంటో చూపించామని చెప్పారు.
హైదరాబాద్ లో నిర్వహించిన ‘మాలల సింహగర్జన సభ’ స్పాన్సర్డ్ మీటింగ్ కాదని.. సొంత ఖర్చులతో మీటింగ్ కు వచ్చారని తెలిపారు. దేశంలో అంతటి భారీ ఎత్తున ఒక కులం మీటింగ్ ఈ మధ్య ఎక్కడా జరగలేదు.. కానీ హైదరాబాద్ లో జరిగిందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీల బడ్జెట్ పూర్తి స్థాయిలో ఖర్చు చేయడం లేదు:
ఎస్సీ, ఎస్టీలకు 25 శాతం, 30 శాతం బడ్జెట్ కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతాయని, కానీ బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేయరని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి అన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు 25 శాతం బడ్జెట్ ఇస్తామని చెప్పి.. బడ్జెట్ ను డైవర్ట్ చేస్తున్నారని అన్నారు. దళితులు నోరు విప్పడం లేదని ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాయి ప్రభుత్వాలు అని అన్నారు. అందుకోసం కొట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రభుత్వంలో ఉద్యోగాలు తగ్గిపోయాయని.. అన్నీ ఔట్ సోర్సింగ్ చేస్తున్నారని.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కొట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొట్లాడినపుడే.. ఆర్థికంగా పైకి వచ్చిప్పుడే కుల వివక్ష పోతుందని ఈ సందర్భంగా చెప్కారు. రిజర్వేషన్ లతో బెనిఫిట్ అయిన వారు ప్రత్యేక ఆర్గనైజేషన్ లుగా ఏర్పడాలని.. ఒక్కో ఉద్యోగి ఒక పది మందిని కి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అందరినీ ప్రయోజకులను చేయాలని సూచించారు. తమ తండ్రి వెంకటస్వామి కూడా అప్పట్లో దళితులందరి కోసం కొట్లాడారని తెలిపారు.
రేపటి తరాల భవిష్యత్తు మన పోరాటాలపైనే ఆధారపడి ఉందని అన్నారు వివేక్. ఎంతో కులవివక్ష ఉన్నప్పటికీ డా.అంబేడ్కర్ 23 డిగ్రీ పట్టాలు సాధించారని చెప్పారు. అంబేడ్కర్ పోరాటాల ఫలితంగానే మనం ఇప్పుడు ఇలా ఉన్నామని.. మన పోరాటాలు మన భవిష్యత్ తరాలను నిర్ణయిస్తాయని చెప్పారు ఎమ్మెల్యే వివేక్.