
మలయాళ నటుడు షైన్ టామ్ చాకో.. పరిచయం అక్కర్లేని పేరు. దసరా, దేవర లాంటి చిత్రాల్లో విలన్గా నటించి తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యాడు. అంతేకాకుండా ఓటీటీ సినిమాలతోనూ క్రేజీ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఓ మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే ‘సూత్రవాక్యం’ (Sootravakyam). ఇందులో షైన్ టామ్ చాకోతో పాటు విన్సీ అలోషియస్, దీపక్ పరాంబోల్, అనఘా అన్నెట్, నసీఫ్ పీపీ ముఖ్య పాత్రల్లో నటించారు.
ఇప్పుడు ఈ సూత్రవాక్యం మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఆగస్టు 21 నుంచి తెలుగులో స్ట్రీమ్ అవుతోంది. ఈ క్రమంలో సినిమా చూడటానికి థ్రిల్లర్ ఆడియన్స్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్లో సూత్రవాక్యం ఒకటిగా నిలిచింది.
ఇకపోతే 'లయన్స్ గేట్ ప్లే' ఓటీటీలోనూ మిగిలిన భాషల్లో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. యూజీన్ జోస్ తెరకెక్కించిన ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ IMDBలో 8.3 రేటింగ్ సాధించింది. ఈ సినిమా కథేంటీ? ఎలా ఉందనేది ఓ లుక్కేద్దాం.
🔍 Every family hides a secret… but what happens when the truth unravels?#Sootravakyam is now streaming only on @etvwin ✨ pic.twitter.com/kp4RJ34IxY
— ETV Win (@etvwin) August 21, 2025
కథేంటంటే:
పాలక్కడ్‌కి దగ్గర్లోని ఒక ప్రశాంతమైన ఊరిలో క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటాడు. ప్రతిరోజూ సాయంత్రం పోలీస్‌స్టేషన్‌లో స్కూల్ పిల్లలకు ఫ్రీగా మ్యాథ్స్ ట్యూషన్ కూడా చెప్తుంటాడు. అదే ఊళ్లో ఉన్న స్కూల్‌లో నిమిషా (విన్సీ అలోషియస్) టీచర్‌గా పనిచేస్తుంటుంది.
అయితే.. పిల్లలు క్రిస్టో చెప్పే పాఠాలు వింటూ నిమిషా క్లాస్‌కి సరిగ్గా వెళ్లకపోవడంతో అతనిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. వీళ్ల స్టూడెంట్ ఆర్య (అనఘా అన్నెట్) ను ఒకరోజు వాళ్ల అన్న వివేక్ (దీపక్ పరాంబోల్) కొడతాడు. ఆ విషయం తెలిసిన క్రిస్టో అతన్ని మందలిస్తాడు. ఆ తర్వాత ట్యూషన్‌కు వెళ్లే మరో స్టూడెంట్ అఖిల్ (నసీఫ్ పీపీ)తో ఆర్య సన్నిహితంగా ఉండడం చూసిన వివేక్ తప్పుగా ఆలోచిస్తాడు. ఆర్యతోపాటు అతనిపై కూడా దాడి చేస్తాడు. ఆ మరుసటి రోజు నుంచే వివేక్ కనిపించకుండా పోతాడు.
క్రిస్టో వాళ్ల ఇంటికి వెళ్లి ఆరా తీస్తే.. వివేక్ పేరెంట్స్ అతను ఇంటర్వ్యూ కోసం ఊరెళ్లాడు అని చెప్తారు. అది నమ్మని క్రిస్టో అతని ఆచూకీ కనిపెట్టేందుకు ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. అందులో భాగంగానే ఒక మర్డర్ కేసు బయటపడుతుంది. చనిపోయిన ఆ అమ్మాయి ఎవరు? వివేక్ ఏమయ్యాడు? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.
విశ్లేషణ: వివేక్ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్, అంతలోనే ఓ అమ్మాయి మర్డర్ వంటి అంశాలతో మూవీ ఇంట్రెస్టింగ్గా సాగింది. ఈ క్రమంలో వివేక్ మిస్సింగ్ వెనుక అతని పేరెంట్స్ హస్తం ఉందనే అనుమానంతో సాగే సీన్స్ ఉత్కంఠ కలిగిస్తాయి. అలాగే, మర్డర్ అయిన అమ్మాయికి వివేక్‌కు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో అనే విషయంపై రాసుకున్న స్క్రీన్ ప్లే ఆసక్తి పెంచేలా చేశాడు డైరెక్టర్. ఈ 2 కేసులను జేవియర్ ఎలా సాల్వ్ చేశారనే ఎండింగ్తో ఆడియన్స్ థ్రిల్ అవుతారు.