ఏప్రిల్ 1 నుంచి..మల్కాజిగిరి లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు

ఏప్రిల్ 1 నుంచి..మల్కాజిగిరి లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు
  •     ఏప్రిల్ 1 నుంచి భారీ వాహనాలపై కఠిన నిబంధనలు

మల్కాజిగిరి, వెలుగు: పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని అదుపులోకి తీసుకురావడం, పాదచారుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కొత్త ట్రాఫిక్ నిబంధనలను ప్రకటించింది. ఏప్రిల్1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. పీక్ అవర్స్​లో అంటే ఉదయం 7:30 నుంచి 11:30 వరకు, సాయంత్రం 3:30 నుంచి రాత్రి 10:30 వరకు ప్రధాన రహదారులపై భారీ, మధ్యతరహా వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. 

కేవలం మధ్యాహ్నం 11:30 నుంచి 3:30 వరకు, తిరిగి రాత్రి 10:30 నుంచి ఉదయం 7:30 వరకు మాత్రమే డీసీఎంలు, క్రషర్ వ్యాన్లు, వాటర్ ట్యాంకర్లు, జేసీబీలు వంటి వాహనాలకు అనుమతి ఉంటుంది. అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట, ఉప్పల్, ఎల్బీ నగర్ వంటి కీలక ప్రాంతాల్లో ఈ ఆంక్షలు అమలు ఉండనున్నాయి. 

పీఎన్టీ, సీటీఓ, వైఎంసీఏ, బైరామల్​గూడ ఫ్లైఓవర్లపై సరుకు రవాణా వాహనాలతోపాటు 10 సీట్లకు పైబడిన ప్రయాణికుల వాహనాలను 24 గంటలపాటు నిషేధించారు. అయితే ఆర్టీసీ, స్కూల్ బస్సులు, అత్యవసర సేవల వాహనాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించారు. నిషేధిత సమయాల్లో వాహనాలు నడపాలంటే ట్రాఫిక్ డీసీపీ ముందస్తు అనుమతి తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.