రెండు వేర్వేరు  గంజాయి గ్యాంగ్​లు అరెస్ట్

రెండు వేర్వేరు  గంజాయి గ్యాంగ్​లు అరెస్ట్

ఎల్​బీనగర్, వెలుగు:  ఏపీ నుంచి మహారాష్ట్రకు ఎండు గంజాయి సప్లయ్ చేస్తున్న రెండు వేర్వేరు గ్యాంగులకు చెందిన 9 మందిని మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 380 కిలోల గంజాయి, 4 కార్లు, 6 సెల్​ఫోన్లు, రూ.3,120 క్యాష్​ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఎల్ బీనగర్​లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కురవి ప్రాంతానికి చెందిన ధరావత్ పుల్ సింగ్(45) గతంలో ఎన్టీడీఎస్(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకొట్రోపిక్ సబ్ స్టాన్సస్) కేసుల్లో అరెస్ట్ అయి జైలుకెళ్లి వచ్చాడు. ఈజీ మనీ కోసం విశాఖపట్నం జిల్లా సీలేరులో గంజాయిని కొని మహారాష్ట్రంలోని షోలాపూర్​కు సప్లయ్ చేస్తున్నాడు. ఇందుకోసం మహబూబాబాద్ జిల్లా కురవికి చెందిన ఎండీ గౌస్ పాషా, భూక్యా భిక్షపతి, భద్రాచలంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన షేక్ మొయినుద్దీన్, సీలేరుకు చెందిన బాలు, మహారాష్ట్రకు చెందిన లింబాజీతో కలిసి ఓ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ధరావత్​పుల్​సింగ్, గౌస్ పాషా, భిక్షపతి, షేక్ మొయినుద్దీన్ ఇటీవల సీలేరు వెళ్లారు. 2 కార్లలో160 కిలోల ఎండు గంజాయిని తీసుకుని మహారాష్ట్రలోని షోలాపూర్​కు బయలుదేరారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్ఓటీ, చౌటుప్పల్ పోలీసులు యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద సోమవారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. రెండు కార్లలో వస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 160 కిలోల గంజాయి, 2 కార్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పారిపోతున్న వారిని వెంబడించి..

ఏపీలోని ఎగువ సీలేరు నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్న ఐదుగురిని మల్కాజిగిరి జోన్ ఎస్ఓటీ, యాచారం పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీకి చెందిన మహ్మద్ ఫిరోజ్ క్యాబ్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. దినేశ్​సింగ్, మహ్మద్ ఖాదర్, అబ్దుల్ రవూఫ్, సతీశ్, ముకుంద్, మహారాష్ట్రకు చెందిన ఠాకూర్​తో కలిసి ఫిరోజ్ ఓ గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. ఫిరోజ్, దినేశ్​ సింగ్, మహ్మద్ ఖాదర్, అబ్దుల్ రవూఫ్, సతీశ్​ఆదివారం రాత్రి ఎగువ సీలేరు నుంచి రెండు కార్లలో గంజాయితో సిటీకి బయలుదేరారు. ఫిరోజ్, దినేశ్ ఓ కారులో, వెనుక కారులో మిగతా వాళ్లు ఉన్నారు. సోమవారం తెల్లవారుజామున పంతంగి టోల్ ప్లాజా దగ్గరికి రాగానే.. అప్పటికే అక్కడ తనిఖీలు చేస్తున్న మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అనుమానంతో వీరి కారును ఆపేందుకు యత్నించారు. నిందితులు తప్పించుకుని ఇబ్రహీంపట్నంలోని మాల్​వైపు వెళ్లారు. ఎస్ఓటీ పోలీసులు వారిని వెంబడిస్తూ యాచారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంగల్ చౌరస్తా వద్ద రెండు కార్లను పట్టుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. 220 కిలోల ఎండు గంజాయి, రెండు కార్లు, 5 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సీపీ చౌహాన్ తెలిపారు. ఫిరోజ్, దినేశ్​పై గతంలో గంజాయి తరలింపు కేసులు ఉనట్లు ఆయన చెప్పారు సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, చౌటుప్పల్ సీఐ దేవేందర్, యాచారం సీఐ లింగయ్య పాల్గొన్నారు.