డీకే శివకుమార్​ను కలిసిన మల్లారెడ్డి

డీకే శివకుమార్​ను కలిసిన మల్లారెడ్డి
  •  కొడుకు భద్రారెడ్డితో కలిసి బెంగళూరులో భేటీ
  • కాంగ్రెస్​లో చేరేందుకే కలిసినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం
  • వ్యాపార పనుల కోసమే కలిశానన్న మల్లారెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్  కీలక నేత, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌‌‌‌తో మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన కొడుకు భద్రారెడ్డి భేటీ అయ్యారు. బెంగళూరులోని ఓ హోటల్‌‌లో గురువారం ఈ సమావేశం జరిగింది. మల్లారెడ్డి పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 7న సీఎం రేవంత్‌‌రెడ్డి సలహాదారు వేం నరేందర్‌‌‌‌రెడ్డిని మల్లారెడ్డి, ఆయన అల్లుడు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌‌‌‌రెడ్డి కలిశారు. ఆ తర్వాత రోజు బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ను కలిసి, మల్కాజ్‌‌గిరి బీఆర్​ఎస్​ ఎంపీ టికెట్​ తమకు వద్దని చెప్పి వచ్చారు. 

తన కొడుకు భద్రారెడ్డి కోసం మొదట్లో బీఆర్​ఎస్​ టికెట్​ కోసం ప్రయత్నించిన మల్లారెడ్డి ఆ తర్వాత పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు వెళ్లి కాంగ్రెస్​ కీలక నేత డీకే శివకుమార్‌‌‌‌ను కలవడం చర్చనీయాంశమైంది. అల్లుడు రాజశేఖర్​రెడ్డితో కలిసి కాంగ్రెస్‌‌లో చేరడానికి, మల్కాజ్‌‌గిరి నుంచి తన కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకోవడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతున్నది. సోనియాగాంధీని, రాహుల్​గాంధీని లేదా ప్రియాంకగాంధీని కల్పించాలని డీకే శివకుమార్​ను మల్లారెడ్డి కోరినట్లు చర్చ జరుగుతున్నది. 

అయితే..  వ్యాపార పనుల కోసమే డీకే శివకుమార్‌‌‌‌ను కలిశానని, ఈ భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని మీడియాకు మల్లారెడ్డి చెప్పారు. బెంగళూరులో ఓ ప్రైవేటు యూనివర్సిటీ కొనుగోలుకు సంబంధించిన చర్చల కోసమే వెళ్లానని తెలిపారు. తాను పార్టీ మారడం లేదని, ఐదేండ్లు బీఆర్‌‌‌‌ఎస్‌‌లోనే ఉంటానన్నారు. ప్రస్తుతం తన వయసు 71 ఏండ్లని, ఇక ముందు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం కూడా తనకు లేదని మల్లారెడ్డి పేర్కొన్నారు.