గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల్లో ఆనందం కనిపిస్తుందని, జయ జయహే తెలంగాణ పాటను అందరూ పాడుతుండడం చూసి సంతోషంగా అనిపించిందని చెప్పారు. మీకు కావాల్సిన రంగులో, మన ప్రాంత పద్మశాలీలు నేసిన చీరలను ప్రభుత్వం ఇస్తుందని మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. చీరలు పంచడానికి వెళ్తున్నానని తన భార్యకు చెప్తే.. ఆమెకు కూడా ఒక చీర కావాలని అడిగిందని, చీరలు అంత బాగున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అనగానే హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, మహిళలు స్వశక్తితో ఎదిగి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా పథకాలు తెస్తున్నామని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మీ ప్రాంతంలో మిత్తీ లేని రుణాలు వస్తున్నాయని, మహిళలకు దీనిపై అవగాహన ఉందని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు ద్వారా 8 వేల కోట్ల రూపాయలను మిగిల్చిందని, మహిళలు అందరూ ఫ్రీ బస్సు స్కీంను వినియోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. 12 వేల కోట్ల రూపాయల ఖర్చుతో సన్న బియ్యం ఇస్తున్నామని గుర్తుచేశారు.
మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సిద్దిపేట జిల్లాకు 11 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా.. 9 వేల ఇండ్లకు బేస్మెంట్ డబ్బులు లక్ష రూపాయలు కూడా వచ్చాయని ఆయన గుర్తుచేశారు. అందరూ ఇండ్లను పూర్తి చేయాలని.. అందరికీ ఇండ్లు వస్తాయని, ఈ సారి రాని వారికి మరో విడతలో ఇస్తామని మంత్రి వివేక్ వెంకట స్వామి హామీ ఇచ్చారు.
