నేడు ఐటీ శాఖ విచారణకు మల్లారెడ్డి

నేడు ఐటీ శాఖ విచారణకు మల్లారెడ్డి

మంత్రి మల్లారెడ్డి ఇవాళ ఐటీ విచారణకు హాజరయ్యే అవకాశముంది. బషీర్‌బాగ్లోని ఇన్ కం ట్యాక్స్ ఆఫీసులో అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. గతవారం మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, ఆఫీసులు, కాలేజీలతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. భారీగా నగదుతో పాటు కొన్ని కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నవంబర్ 28న విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, ఉద్యోగులు సహా 16 మందికి నోటీసులు ఇచ్చారు. ఐటీ సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లకు సంబంధించిన వివరాలు, బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తో హాజరుకావాలని అందులో స్పష్టం చేశారు. 

గతవారం ఐటీ అధికారులు రెండ్రోజుల పాటు మల్లారెడ్డి నివాసం, కార్యాలయాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బందువులు రఘునాథరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, సోదరులు గోపాల్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన సోదాల్లో దాదాపు రూ.15 కోట్ల నగదుతో పాటు పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, పన్ను ఎగవేత, మేనేజ్ మెంట్ కోటా కింద సీట్ల అమ్మకాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.