ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తం:ఖర్గే

ఎంత తొక్కాలని చూస్తే అంత లేస్తం:ఖర్గే
  •     అందరం ఒక్కటై కొట్లాడితే మోదీ ఏమీ చేయలేరని కాంగ్రెస్ చీఫ్​ కామెంట్​
  •     దేశంలో ద్వేషం, ప్రేమకు మధ్య యుద్ధం జరుగుతోందన్న  రాహుల్ గాంధీ
  •     ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాల నిరసనలు

న్యూఢిల్లీ: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఉభయ సభల నుంచి 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినందుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శుక్రవారం ‘ఇండియా’ కూటమి నిరసనలకు దిగింది. ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో చేపట్టిన ఈ నిరసనలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. అందుకే ఇండియా కూటమి పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చాయి. అందరం ఒక్కటైతే.. ప్రధాని నరేంద్ర మోదీ ఏమీ చేయలేరు” అని చెప్పారు. తమను ఎంతగా అణగదొక్కాలని చూస్తే.. తాము అంతగా పైకి లేస్తామని.. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఐక్యంగా పోరాడుతున్నామని చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే బాధ్యతలను మోదీ, అమిత్ షా తీసుకున్నారని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు, కార్మికులు, మహిళలు, రైతులను అణచివేసేందుకు వీళ్లు పని చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఉన్నతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్లు (రాజ్యసభ చైర్మన్‌‌ జగదీప్‌‌ ధన్‌‌ఖడ్).. ‘నేను ఫలానా కులానికి చెందిన వాడిని, అందుకే నన్ను అవమానిస్తున్నారు’ అని అంటున్నారు. మేము నోటీసు (పార్లమెంట్‌‌లో) ఇస్తే.. కనీసం దాన్ని చదివే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. మరి బీజేపీ ప్రభుత్వం దళితుడిని మాట్లాడనివ్వడం లేదని నేను అనొచ్చా?” అని ప్రశ్నించారు. తాము మోదీ ప్రభుత్వానికి భయపడబోమన్నారు. ‘‘మీరు మమ్మల్ని భూమిలో పాతిపెట్టాలని ఎంత ప్రయత్నించినా.. మళ్లీ మొలిచే అలవాటు ఉన్న విత్తనాలము మేము” అని చెప్పారు. తమ మాట్లాడే హక్కును ఎవ్వరూ హరించలేరన్నారు.

నిరుద్యోగమే కారణం

‘‘దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువతకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఇన్‌‌స్టా, ట్విట్టర్, ఫేస్‌‌బుక్‌‌లలో యువత ఎన్ని గంటలు గడుపుతున్నారనే దానిపై నేను ఒక చిన్న సర్వే చేయించా. సగటున ఏడున్నర గంటలు యువత ఫోన్‌‌ చూస్తూ గడుపుతున్నారని అందులో తేలింది. రోజులో ఏడున్నర గంటలు యువత ఫోన్లు చూస్తూ కూర్చుంటున్నారు. ఎందుకంటే వాళ్లకు ఉద్యోగాలు లేవు మరి. ఇదే నిజం. అందుకే పార్లమెంటు హౌస్‌‌ లోపలికి దూకారు. ఇది దేశంలో ప్రతి యంగ్‌‌స్టర్‌‌‌‌ ఫీలింగ్” అని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రతిపక్ష నేతలంతా ఏకమయ్యారని, ఇది ద్వేషానికి, ప్రేమకు మధ్య జరుగుతున్న యుద్ధమని రాహుల్ అన్నారు. ‘‘దేశంలో ఉన్న నిరుద్యోగం గురించి మీడియా మాట్లాడదు. కానీ పార్లమెంటు బయట సస్పెండెడ్ ఎంపీలను రాహుల్ గాంధీ వీడియో తీస్తున్నారంటూ మాట్లాడుతుంది” అని మండిపడ్డారు. లెఫ్ట్, ఎన్సీపీ, ఎస్పీ, ఎన్‌‌సీ, టీఎంసీ, జేఎంఎం, ఆర్జేడీ తదితర పార్టీల నేతలు ఈ నిరసనలకు హాజరయ్యారు.

ముందు బీజేపీ ఎంపీలే పారిపోయారు: రాహుల్ గాంధీ

పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై జవాబు చెప్పాలని అమిత్ షాను ప్రశ్నించినందుకు ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘‘బీజేపీ ఎంత ద్వేషాన్ని వ్యాపింపజేస్తుందో.. అంతే ప్రేమ, సోదరభావాన్ని, ఐక్యతను ఇండియా కూటమి పార్టీలు చాటుకుంటాయి. పార్లమెంటు నుంచి 150 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం 60 శాతం మంది భారతీయుల గొంతు నొక్కింది” అని ఆరోపించారు. లోక్‌‌సభలో స్మోక్ అటాక్‌‌ ఘటన గురించి మాట్లాడుతూ.. తమను తాము దేశభక్తులమని చెప్పుకునే వారు డబ్బాల నుంచి పొగలు రావడంతో పారిపోయారని బీజేపీ ఎంపీలపై రాహుల్ సెటైర్లు వేశారు.