కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నాయకులతో.. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమావేశం అయ్యారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే.. గెలుపే లక్ష్యంగా అన్ని విధాలుగా సిద్ధం కావాలని ఖర్గే పిలుపునిచ్చారు. 2023లో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... శాసనసభలోని మొత్తం 224 మంది సభ్యులను ఎన్నుకునేందుకు రాష్ట్ర నాయకత్వంలోని అన్ని వర్గాలను.. ఒక్కతాటిపైకి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బీజేపీ పాలిత రాష్ట్రంలో ఉన్న అధికార వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లి.. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో పార్టీ క్యాడర్ జోష్ లో ఉంది. అలాగే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. నేతలు, కార్యకర్తలను ఇప్పటినుంచే గెలుపు కోసం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాడితే.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచినట్లు.. అన్ని రాష్ట్రాల్లోనూ విజయం సాధించవచ్చని ఖర్గే గుర్తు చేశారు.

