
ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని నాశానం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్ధి మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఎంతో అభివృద్ధి చేసిందని, ప్రభుత్వ సంస్థలను మోడీ అమ్మేస్తున్నారని విమర్శించారు. పార్టీ అంతర్గత నియమాల ప్రకారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. జైపూర్ చింతన్ శివర్ లో తీసుకున్న నిర్ణయాల అమలుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు.. బేగంపేట విమానశ్రాయంలో ఖర్గేకు కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇవాళ హైదరాబాద్కు వచ్చిన ఖర్గే.. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలతో భేటీ ఆయ్యారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు అక్టోబర్ 17న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నామినేషన్లు దాఖలు చేశారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. 9 వేల మందికి పైగా కాంగ్రెస్ డెలిగెట్స్ ఓట్లు వేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా నవంబర్, 2000లో ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు. అంతకుముందు 1997లో శరద్ పవార్, రాజేష్ పైలట్‌లను సీతారాం కేస్రీ ఓడించారు.