రైతుబంధుపై కేసీఆర్ చేతులెత్తేశారు… మల్లు భట్టి

రైతుబంధుపై కేసీఆర్ చేతులెత్తేశారు… మల్లు భట్టి

ఢిల్లీ : తెలంగాణలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క. దుబ్బాక వ్యవసాయ మార్కెట్ ముందు యూరియా కోసం లైన్ లో రైతు నిలబడి చనిపోయిన ఘటన కలిచివేసిందని చెప్పారు. సిద్దిపేట మోడల్ అంటూ చెప్పుకునే కేసీఆర్ ఈ ఘటన ను చూసి సిగ్గుపడాలని అన్నారు. యూరియా కోసం రైతాంగం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కేసీఆర్ అవినీతిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తాం

రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఢిల్లీ టూర్ వివరాలను మల్లు భట్టి తెలిపారు.  సభ్యత్వ నమోదు, మునిసిపల్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై జాతీయ పార్టీ సీనియర్ నేతలతో చర్చించామని చెప్పారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, విద్యుత్ కొనుగోళ్లలో జరుగుతున్న అవినీతి లాంటి బర్నింగ్ అంశాలపై భవిష్యత్ పోరాటలపై పార్టీ నేతలతో చర్చించామని చెప్పారు. కేంద్రం హోంమంత్రి ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై లోతైన దర్యాప్తు చేయాలని కోరబోతున్నామని చెప్పారు.

రైతు బంధు ఊసేది..

సీజన్ ప్రారంభమైనా కూడా రైతు బంధు పథకం ఇంకా రాలేదని అన్నారు. ఎన్నికల వేళ రైతు బంధు పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు చేతులు ఎత్తేసిందని విమర్శించారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో రైతులపై అదనపు భారం పడుతోందన్నారు. రైతులకు విడుదల చేయవలసిన రూ.20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళనలో ఉందని అన్నారు. డబ్బులు పెట్టి కొనుక్కుందామన్నా యూరియా దొరకని పరిస్థితి తెలంగాణలో ఉందని మల్లు భట్టి అన్నారు.

పీసీసీ రేసులో నేను లేను

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని మల్లు భట్టి చెప్పారు. రానున్న ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గెలిపించుకోవాలనే దానిపై దృష్టి పెట్టామని చెప్పారు.