
- డెయిరీ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతం: భట్టి
- డ్వాక్రా మహిళలను పాడి రంగంలో ప్రోత్సహిస్తున్నామని వెల్లడి
- హైటెక్స్ లో 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన భట్టి
హైదరాబాద్, వెలుగు: పాడి పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. డెయిరీ రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. బడ్జెట్‌లో వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక నిధులు కేటాయించామని ఆయన చెప్పారు. సోమవారం హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 50వ డెయిరీ ఇండస్ట్రీ కాన్ఫరెన్స్ ను భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి హయాంలో ఈ దేశంలో శ్వేత విప్లవానికి నాంది పడిందని గుర్తుచేశారు. "పాలు పొంగించండి.. సంపద పొందండి.. పాలు ఉన్నచోటే సంపద ఉంటుంది” అని భట్టి చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు-, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య అనేక పారిశ్రామిక క్లస్టర్లు నిర్మించాలని ప్రణాళికను సిద్ధం చేశామని, అది డెయిరీకి అనువైన ప్రాంతమని తెలిపారు. ఈ రంగంలో భారీగా పెట్టుబడులను పెట్టాలని కోరారు. అసంఘటిత రంగంగా ఉన్న పాడి పరిశ్రమను సంఘటిత రంగం వైపు తీసుకు రావలసిన అవసరం ఉందన్నారు. పెట్టుబడులకు హైదరాబాద్ అన్ని రకాలుగా అనువైన ప్రాంతమని, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని వెల్లడించారు. లక్షలాదిగా ఉన్న డ్వాక్రా మహిళలను పాడి రంగంలోకి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. గతంలో ఐకేపీ ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని, త్వరలోనే ఈ స్కీమ్‌ను తిరిగి ప్రారంభిస్తామని భట్టి ప్రకటించారు.
వినియోగానికి తగిన ఉత్పత్తి లేదు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో పాల వినియోగానికి తగిన ఉత్పత్తి లేదని, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పాడి పరిశ్రమ ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు.