కృష్ణా జలాల్లో తెలంగాణ వాట తేవడం కేసీఆర్ కు చేత కాలేదు : మల్లు భట్టి విక్రమార్క

కృష్ణా జలాల్లో తెలంగాణ వాట తేవడం కేసీఆర్ కు చేత కాలేదు : మల్లు భట్టి విక్రమార్క

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుతో బీఆర్ఎస్ కు పోటు పొడిచి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడుతారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. 2023లో  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు లక్ష్మీదేవి రిజర్వాయర్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృష్ణా జలాల్లో తెలంగాణ వాట తేవడం చేత కాలేదన్నారు. రాష్ర్టంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిత్యావసర సరుకుల ధరలను నియంత్రిస్తామన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే.. ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్న భట్టి.. రూ.5 లక్షల వరకు ఉచితంగా వైద్యం చేయించుకోవడం కోసం ఆరోగ్యశ్రీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. యువకులకు నిరుద్యోగ భృతి నెలకు రూ.4 వేలు ఇస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి సభలో మల్లు భట్టి విక్రమార్క ఈ కామెంట్స్ చేశారు. 

దశాబ్దాలు గడుస్తున్నా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కావడం లేదని, నీళ్లు రావడం లేదన్నారు మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని పాలించే పెద్దలకు ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పం లేదు కాబట్టే నిర్మాణం చేపట్టలేదన్నారు. ప్రజల అవసరాల కోసం కాంగ్రెస్ హయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల, కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులను నిర్మించామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చేవెళ్లను చంపి.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. కాళేశ్వరం గోదావరి నది మీద కట్టిన చెక్ డ్యామ్ మాత్రమే అని, దాని వల్ల ఒక్క ఎకరాకు నీరందలేదన్నారు. ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకోవడమే వారిపనన్నారు. ‘‘లక్ష్మీదేవిపల్లికి జూరాల నుండి నీరు పారించాలి. నీళ్లు పారించడానికి గతంలో ఉన్న ఆంధ్ర పాలకులు అడ్డులేరు కదా.. ఇప్పుడున్నది మీరే కదా.. ఎందుకు పారడం లేదు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కృష్ణానది నుండి ఒక్క చుక్క నీరు కూడా పాలమూరుకు పారలేదు’’ అని వ్యాఖ్యానించారు. లక్ష్మీదేవిపల్లి రిజార్వాయర్ పూర్తి చేయకపోతే ఈ ప్రాంతంలో ఓట్లు అడగనన్న సీఎం కేసీఆర్.. ఇచ్చిన మాట మీద నిలబడాలన్నారు. దున్నే వాడిదే భూమి యాక్ట్ మొట్టమొదటిసారి చట్టం తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. భూముల్లేని ప్రజలకు భూములు ఇచ్చామని చెప్పారు. 

మల్లు భట్టి విక్రమార్కతో పాటు సభలో పాల్గొన్న గద్దర్ రాష్ర్ట ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన ఆట పాటలతో అలరించారు. ఓటును నోటుకు అమ్ముకోవద్దని, బానిసలు కావొద్దని గద్దర్ కోరారు. తెలంగాణ ఓటర్లు ఓట్లతో గుద్ది BRS ని ఇంటికి సాగనంపాలన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదు గానీ... ప్రతి గ్రామానికి మద్యం షాపులు పెట్టి యువత మద్యానికి బానిస అయ్యేలా చేశారని ఆరోపించారు. హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించారే గానీ.. కేసీఆర్ మనసులో అంబేద్కర్ లేరని, రాజ్యాంగాన్ని  మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.