దళితులను అవమానించింది బీఆర్ఎస్సే : మల్లు రవి

దళితులను అవమానించింది బీఆర్ఎస్సే :  మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అవమానం జరిగిందంటూ బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని.. కానీ దళితులను, దళిత నేతలను ఆ పార్టీ ఎంతగా అవమానించిందో అందరికి తెలుసని మల్లు రవి అన్నారు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భట్టిని ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమిస్తే.. అప్పటి సీఎం కేసీఆర్ సీఎల్పీ విలీనం అంటూ భట్టికి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని మండిపడ్డారు. అలాంటి పార్టీ మాటలు ఎవరూ నమ్మరని తెలిపారు. బీఆర్ఎస్ విమర్శలపై సోమవారం మల్లు రవి విడుదల చేసిన ఓ ప్రకటనలో ఫైర్ అయ్యారు. దళిత ముఖ్యమంత్రి అంటూ ప్రగల్బాలు పలికి మోసం చేసిన బీఆర్ఎస్ మాటలు ఎవరూ నమ్మరని అన్నారు.

కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చిండు 

రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన తీరు జుగుప్సాకరంగా ఉందని మల్లు రవి అన్నా రు. కేటీఆర్ అన్న మాటలన్ని.. ఆయన తన తండ్రి కేసీఆర్​ను తిట్టినట్టుగా ఉందన్నారు. కేసీఆర్ ఎక్కడ రాజకీయాలు మొదలు పెట్టారు.. ఎక్కడ మంత్రి అయ్యారు.. ఎక్కడ డిప్యూటీ స్పీకర్ అయ్యారో కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. స్థాయి, సోయి మరిచి కేటీఆర్ ఇలాగే మాట్లాడితే ప్రజలు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు.