జేపీఎస్‌లను బెదిరించడం.. వారి హక్కులను హరించడమే
కాంగ్రెస్ నేత మల్లు రవి
హైదరాబాద్,వెలుగు : జూనియర్ పంచాయతీ సెక్రటరీ (జేపీఎస్)లు వెంటనే విధుల్లో చేరకుంటే ఉద్యోగాల్లోంచి తీసేస్తామని బ్లాక్ మెయిల్ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. ఇలా బెదిరించడం వాళ్ల హక్కులను హరించడమే అవుతుందని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జేపీఎస్‌ల డిమాండ్లపై ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించి, సమ్మె విరమింపజేయాల్సిందిపోయి.. బెదిరించడమేంటని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్, మంత్రుల మాటలు, బ్లాక్ మెయిలింగ్ ప్రకటనలు నియంతృత్వానికి, రాచరికపోకడలకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్యదర్శులతో చర్చించి వారి డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయకుంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారిని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు.