జర్నలిస్టులకు స్థలాలు వచ్చే వరకు తోడుంటా: మల్లు రవి

జర్నలిస్టులకు స్థలాలు వచ్చే వరకు తోడుంటా: మల్లు రవి
  •     వారి హక్కులను కాపాడుతాం: మల్లు రవి
  •     జర్నలిస్టుల భూముల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని హామీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి అన్నారు. హైదరాబాద్ జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాలను వారికి అందించే వరకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన జవహర్ లాల్ నెహ్రూ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (టీంజేఎన్‌‌జే) సభ్యుల సమావేశానికి ఆయన ముఖ్య​అతిథిగా హాజరై, మాట్లాడారు. ప్రజా వ్యతిరేక పాలన అందిస్తున్న బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో జర్నలిస్టులు కూడా సహకరించారని ఆయన పేర్కొన్నారు. సొసైటీ భూముల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా అప్పటి బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం భూములను వారికి ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి అవగాహన ఉందని, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్టులంతా కలిసి ప్రతినిధి బృందంగా ఏర్పడి సీఎంని కలవాలని సూచించారు. జర్నలిస్టుల ఇతర సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు భూములిచ్చామని, త్వరలో జేఎన్‌‌జే సొసైటీకి కూడా భూములందేలా కృషి చేస్తామని తెలిపారు. మీకిచ్చే స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని మరో జర్నలిస్టు కాలనీని ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. సొసైటీలోని 1,100 కుటుంబాలకు మంచి జరగాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జేఎన్‌‌జే ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలను ఆమోదించారు. ఈ సమావేశంలో జేఎన్‌‌జే నాయకులు రమణారావు, అశోక్ రెడ్డి, నాగభూషణం, బోడపాటి శ్రీనివాస్, హసన్ షరీఫ్, శ్రీనివాస్ తాతా, మంజుల, తాహెర్ రుమాని తదితరులు పాల్గొన్నారు.