
- అప్పుడు అపవిత్రంగా కనిపించిన ఈడీ.. ఇప్పుడు పవిత్రంగా కన్పిస్తున్నదా అని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మీరు అధికారంలో ఉన్నప్పుడు అపవిత్రంగా కనిపించిన ఈడీ.. ఇప్పుడు పవిత్రంగా కనిపిస్తున్నదా అని బీఆర్ఎస్ నాయకులను మంత్రి శ్రీధర్ బాబు నిలదీశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పుడు ఈడీని పొగుడుతున్న బీఆర్ఎస్ నాయకులు, ఆనాడు కవితపై కేసు నమోదు చేస్తే ఏ విధంగా విమర్శించారో అందరికీ తెలుసన్నారు. 60 ఏండ్ల కలను సాకారం చేస్తూ సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. పదేండ్ల పాలనలో తెలంగాణను బీఆర్ఎస్ దయ్యంలా పట్టి పీడించిందని విమర్శించారు
. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. ఈడీని పావుగా చేసుకొని కాంగ్రెస్ అగ్ర నేతలపై బీజేపీ అక్రమ కేసులు పెడితే.. బీఆర్ఎస్ నాయకులు సమర్థించడం ఏమిటని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న చీకటి ఒప్పందం ఏమిటని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని కలిస్తే తప్పేముందన్నారు. మీరు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్న తమపై విమర్శలు చేయడం ఏమిటని బీఆర్‌ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలేతప్ప అడుగడుగునా అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు.