నాగర్​కర్నూల్​ నుంచి ఎంపీగా పోటీ చేస్త : మల్లు రవి

నాగర్​కర్నూల్​ నుంచి ఎంపీగా పోటీ చేస్త : మల్లు రవి
  •     ప్రత్యేక ప్రతినిధి పదవి అందుకు అడ్డు రాదు: మల్లు రవి
  •     అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ఎక్కడ?
  •     అస్సాం సీఎం సరికాదని ఫైర్

హైదరాబాద్, వెలుగు : నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేయనున్నట్లు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి తెలిపారు. తనకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ధన్యవాదాలు  చెప్పారు. సెక్రటేరియేట్​మీడియా సెంటర్​లో సోమవారం ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన హర్కర వేణుగోపాల్ తో కలిసి మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక ప్రతినిధి పదవి తాను ఎంపీగా పోటీ చేసేందుకు అడ్డురాదన్నారు. తాను గతంలో రెండుసార్లు ఎంపీగా పని చేశానని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి రాక పోవడం చూస్తుంటే మోదీ ప్రభుత్వం గిరిజనులు, దళితులపై చూపిస్తున్న వివక్ష స్పష్టంగా కనిపించిందన్నారు. రాజీవ్ గాంధీ హయంలోనే రామ మందిర నిర్మాణానికి పూనుకున్నారని, కోర్టు కేసులతో అది పెండింగ్ పడిందన్నారు. రామాయణం, సుందరాకాండ భారతీయుల డీఎన్ఏలోనే ఉందన్నారు. కొత్తగా మోదీ దేశ ప్రజలకు చెప్పాల్సింది, ప్రజలు నేర్చుకోవాల్సింది ఏమీ లేదన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లి సీఎం రేవంత్​బృందం రూ. 40 వేల కోట్లు పెట్టుబడుల తీసుకురావడం పట్ల రాష్ట్ర ప్రజల పక్షాన ధన్యవాదాలు చెప్పారు. అస్సాం సీఎం గతంలో కాంగ్రెస్​లో మంత్రిగా పనిచేశారని, ఇప్పుడు బీజేపీలో చేరి సీఎంగా రాహుల్ గాంధీ యాత్రను అడ్డుకున్నారన్నారు.  

సీనియర్​ నేతలతో మల్లు రవి భేటీ

ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి పార్టీ నేతలతోపాటు వివిధ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. సోమవారం ఉదయం ఆయన కాంగ్రెస్​ సీనియర్​లీడర్, మాజీ ఎంపీ కేవీపీ రాంచందర్​రావు ఇంటికి వెళ్లి కలిశారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా కేంద్ర నుంచి రావాల్సిన పనులు, నిధులపై ఆయన చర్చించారు. ఈ అంశాల్లో కేవీపీ సూచనలు, సలహాలు కోరారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణను కూడా మల్లు రవి కలిశారు.

బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై సలహాలు కోరారు. ఈ సందర్భంగా మంద కృష్ణ దంపతులు మల్లు రవిని శాలువతో సత్కరించారు. తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మంద కృష్ణ చెప్పారు. తర్వాత మల్లు రవి బీసీ నాయకుడు, కాంగ్రెస్​ సీనియర్​నేత నాగయ్యను కలిసి  ఆశీర్వాదం పొందారు. భూదాన యజ్ఞ బోర్డు ఛైర్మన్​ రాజేంద్ర రెడ్డిని కూడా మల్లు రవి కలిశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఇంటర్నేషనల్​ స్కూళ్ల స్థాపన కోసం అవసరమైన భూముల సేకరణపై ఆయనతో చర్చించారు. సీనియర్​ జర్నలిస్ట్​ పాశం యాదగిరిని కూడా కలిసిన మల్లు రవి ప్రభుత్వం సజావుగా సాగేందుకు, తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సలహాలు ఇవ్వాలని కోరారు.