బీఆర్​ఎస్​ హయాంలో .. సెక్రటేరియెట్​ జైలులాగా ఉండేది : మల్లు రవి

బీఆర్​ఎస్​ హయాంలో .. సెక్రటేరియెట్​ జైలులాగా ఉండేది  : మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియెట్ ఓ జైలులాగా ఉండేదని ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి అన్నారు. కాంగ్రెస్​ ప్రజాపాలనలో రోజూ వందలాది మంది సెక్రటేరియెట్​కు వస్తున్నారని చెప్పారు. శనివారం ఆయన సెక్రటేరియెట్ మీడియా సెంటర్​లో మాట్లాడారు. ప్రభుత్వాన్ని రోజూ తిట్టినంత మాత్రాన కేటీఆర్ పెద్ద లీడర్ అవుతారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

ఫెవికాల్ బంధం బీజేపీ, కాంగ్రెస్​ది కాదని, బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే ఫెవికాల్ బంధం ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఓట్లు పెద్ద సంఖ్యలో ట్రాన్స్​ఫర్​ అయ్యాయన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న బంధం వల్లనే కవితను అరెస్ట్​ చేయలేదన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, కవిత కేసులను ఒప్పందంలో భాగంగానే నిర్వీర్యం చేశారన్నారు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.

పులి వస్తున్నదని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, కేసీఆర్ ప్రజల్లోకి రాకుండా ఎవరు ఆపారని నిలదీశారు. అడవిలోని జంతువుల స్వేచ్ఛను పులి హరించినట్టే.. కేసీఆర్ ప్రజల స్వేచ్ఛను హరించారన్నారు. బీఆర్ఎస్​ అధికారం పోయాక.. ఆ పార్టీలో ఎంపీగా పోటీ చేసేందుకు అభ్యర్థులు కరువయ్యారని ఎద్దేవా చేశారు.