
భారత్ – చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో పొరుగు దేశాన్ని దీటుగా దెబ్బకొట్టాలని డిమాండ్ చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తాజాగా టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. అయితే యాప్స్ బ్యాన్‌తో సరిపోదని, కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా దూకుడు చర్యలను కంట్రోల్ చేసేందుకు భారత్ దీటుగా స్పందించాలని చెప్పారు. చైనాకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఎటువంటి నిర్ణయానికైనా పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు మమతా బెనర్జీ. ఇవాళ కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చైనా దుందుడుకు చర్యలను కట్టడి చేసేందుకు ఎలాంటి యాక్షన్‌కు దిగాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. చైనాకు దీటుగా జవాబు చెప్పేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని, అలా చేయకుంటే ప్రభుత్వ తీరుపై ప్రజలకు అనుమానాలు తలెత్తుతాయని అన్నారు. విదేశాంగ వ్యవహారాల్లో తలదూర్చకూడదన్నది తమ పార్టీ విధానమని, చైనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పూర్తి మద్దతు ఇచ్చేందుకు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని చెప్పారు మమతా బెనర్జీ.