మే 5న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మమతా

మే 5న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మమతా

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ   ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే పార్టీకి అపూర్వ విజయాన్ని అందించిన ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం నందిగ్రామ్‌లో సువేందు అధికారి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ఆమే మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. కొత్తగా ఎన్నికైన టీఎంసీ ఎమ్మెల్యేలతో సోమవారం పార్టీ అధిష్టానం సమావేశమైంది. ఇందులోభాగంగా దీదీని తమ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మే 5వ తేదీ బుధవారం రోజున మమత సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి, సీనియర్‌ నేత పార్థ ఛటర్జీ తెలిపారు. ఇందుకోసం రాత్రి 7 గంటలకు దీదీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ను కలవనున్నట్లు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

మమతా బెనర్జీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లేటెస్టుగా జరిగిన ఎన్నికల్లో 213 స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ భారీ విజయం సాధించింది. మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నప్పటికీ.. మరో 6నెలల్లోపే అసెంబ్లీ సభ్యురాలిగా మమతా బెనర్జీ గెలవాల్సి ఉంటుంది. అయితే ఆమె ఏ స్థానం నుంచి పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.