- బీజేపీ పునాదులను కదిలిస్త: మమత
- ఎలక్షన్ కమిషన్.. బీజేపీ కమిషన్‌గా మారిందని వ్యాఖ్య
- బెంగాల్‌లో ఒక్క ఓటు తొలగించినా ఊరుకునేది లేదని హెచ్చరిక
- సీఏఏ కింద సిటిజన్‌షిప్ కోసం అప్లై చేసుకోవద్దని మతువా ప్రజలకు సూచన
బన్‌గావ్ (బెంగాల్): రాష్ట్రంలో ‘సర్’ పేరుతో నిజమైన ఓటర్లలో ఒక్కరిని తొలగించినా ఊరుకునేది లేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎలక్షన్ కమిషన్ కాస్తా బీజేపీ కమిషన్‌గా మారిందని విమర్శించారు. ఢిల్లీ నుంచి వస్తున్న ఆదేశాలనే ఈసీ పాటిస్తోందని ఆరోపించారు.
వచ్చే ఏడాది బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపడుతున్నది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం నార్త్ 24 పరగణాల జిల్లాలోని బన్‌గావ్‌లో మమత ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ అధికంగా ఉండే మతువా కమ్యూనిటీ ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.
‘‘బిహార్‌లో చేపట్టిన ‘సర్’ ప్రక్రియ వల్లనే అక్కడ ప్రతిపక్ష కూటమి ఓడిపోయింది. బీజేపీ ఆటను ఆ కూటమి గ్రహించలేకపోయింది. బిహార్‌లో చేసినట్టే బెంగాల్‌లోనూ చేస్తామంటే కుదరదు. మీరు (బీజేపీ) ఇక్కడ ఒక్క నిజమైన ఓటర్‌ను తొలగించినా ఊరుకునేది లేదు. మీరు నన్ను టార్గెట్ చేసి, రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తే.. మొత్తం దేశాన్నే షేక్ చేస్తాను.
దేశవ్యాప్తంగా మీ పార్టీ పునాదులను కదిలిస్తాను” అని కేంద్రాన్ని హెచ్చరించారు. మంచిగా ఉన్న పులి కంటే, దెబ్బతిన్న పులి చాలా డేంజర్ అని పేర్కొన్నారు. బీజేపీ తనతో పోరాడలేదని, తనను ఓడించలేదని అన్నారు. ‘సర్’ చేపట్టడానికి రెండు మూడేండ్ల టైమ్ పడుతుందని, ఇలా ఎన్నికల ముంగట హడావుడిగా చేపట్టాల్సిన అవసరమేంటి? అని ప్రశ్నించారు. ‘సర్’ ఒత్తిడి కారణంగా ఎన్నికల సిబ్బంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ సూసైడ్స్‌కు బీజేపీ, ఈసీదే బాధ్యత అని మండిపడ్డారు.
సీఏఏకు అప్లై చేసుకోవద్దు..
సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) కింద సిటిజన్‌షిప్ కోసం అప్లై చేసుకోవద్దని మతువా ప్రజలకు మమత సూచించారు. ‘‘ఎన్నికలు దగ్గరికి రావడంతో మతం ప్రాతిపదికన బీజేపీ నేతలు సీఏఏ ఫారమ్స్ పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ అప్లై చేసుకుంటే, మిమ్మల్ని మీరు బంగ్లాదేశ్ సిటిజన్‌గా ఒప్పుకున్నట్టే.
ఈ కారణం చూపెట్టి, మీరు విదేశీయుడని చెప్పి, మీ ఓటును తొలగిస్తారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన మీరు.. ఇప్పుడు ఓటు హక్కును కోల్పోతారు” అని అన్నారు. ‘‘బెంగాలీ, బంగ్లా భాషలు ఒకే విధంగా ఉంటాయి. అలా అని బెంగాలీ మాట్లాడే వాళ్లందరూ బంగ్లాదేశీయులు అయిపోతారా? ఒకవేళ నేను బెంగాల్‌లోని బీర్బూమ్‌లో పుట్టకపోయి ఉంటే, వాళ్లు నన్ను కూడా బంగ్లాదేశీ అనేవారు” అని బీజేపీ నేతలపై మండిపడ్డారు.
హెలికాప్టర్ రద్దు..
బన్‌గావ్ ర్యాలీకి మమత హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉండగా, అది రద్దయింది. దీంతో ఆమె రోడ్డు మార్గంలో వెళ్లారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని మమత ఆరోపించారు. తనతో ఆటలాడొద్దని బీజేపీని హెచ్చరించారు. కాగా, మమత ట్రిప్ కోసం బుక్ చేసిన హెలికాప్టర్‌కు లైసెన్స్ గడువు ముగిసిందని, అయినా నడుపుతుండడం వల్లే ఆ ట్రిప్‌ను రద్దు చేశామని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
