- కొత్తగా విధుల్లో చేరిన ఆఫీసర్లకు మామిండ్ల చంద్రశేఖర్ సూచన
హైదరాబాద్, వెలుగు: నిజాయితీ, నిబద్ధతే వృత్తి ధర్మంగా భావించి గ్రూప్1 అధికారులు తమ విధులను నిర్వర్తించాలని తెలంగాణ రాష్ట్ర గ్రూప్1 ఆఫీసర్ల అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. ఇటీవల గ్రూప్1 అధికారులుగా కొత్తగా విధుల్లో చేరిన 18 శాఖలకు చెందిన 560 మంది ఆఫీసర్లు అసోసియేషన్‌లో సభ్యులుగా చేరారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రశేఖర్ గౌడ్ వారికి పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు.
ప్రజా సేవలో అద్భుతమైన ప్రయాణానికి
నాంది పలికిన గ్రూప్1 అధికారులు.. తమ సర్వీసులో మంచి పేరు సంపాదించాలని సూచించారు. సమాజంలో గ్రూప్1 అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దాని గౌరవాన్ని మరింత పెంచేలా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్, ప్రతినిధులు వేణు మాధవ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, హరికిషన్, అంజన్ రావు, నేతనకంటి వెంకట్, రమేశ్, ఖురేషి, భవాని, అనితా గ్రేస్, ప్రశాంతి, వెంకట్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
