కమల్ హాసన్‌‌తో మమ్ముట్టి మూవీ

కమల్ హాసన్‌‌తో మమ్ముట్టి మూవీ

మమ్ముట్టి బేసిగ్గా మలయాళీ అయినా.. ‘దళపతి’ లాంటి సినిమాలతో తమిళులకి, స్వాతి కిరణం, యాత్ర లాంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యారు. మాలీవుడ్‌‌లో సూపర్ స్టార్ అయ్యుండి కూడా ఇతర భాషల చిత్రాల్లో నటించడంతో పాటు వేరే హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారాయన. త్వరలో కమల్ హాసన్‌‌తో కూడా కలిసి నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కమల్ హీరోగా మహేష్‌‌ నారాయణన్‌‌ దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోతో సమానమైన మరో పాత్ర ఉంటుందట. దాని కోసం మమ్ముట్టిని అడిగారని, ఆయన కూడా ఓకే అన్నారని కోలీవుడ్ టాక్. 

రీసెంట్‌‌గా ‘విక్రమ్‌‌’తో బ్లాక్ బస్టర్‌‌‌‌ హిట్ కొట్టడంతో కమల్ నెక్స్ట్ మూవీపై అందరి దృష్టీ ఉంది. అందుకే ఆ రేంజ్ నటుణ్ని ఏరి కోరి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శింబు కూడా ఈ క్రేజీ ప్రాజెక్టులో పార్ట్ కానున్నాడని అంటున్నారు. అదే నిజమైతే అంచనాలు మామూలుగా ఉండవు. ఇప్పటికే ‘విక్రమ్‌‌’లో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్‌‌తో కలిసి ఇంప్రెస్‌‌ చేసిన కమల్.. మమ్ముట్టితో కలిసి ఇంకెంత అలరిస్తారోననే ఆసక్తి కలుగుతోంది. ప్రస్తుతం నాలుగైదు మలయాళ సినిమాలతో పాటు అఖిల్‌‌ హీరోగా రూపొందుతున్న ‘ఏజెంట్’ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు మమ్ముట్టి. కమల్‌‌తో మూవీ ఆగస్ట్‌‌లో మొదలు కానుందట. అంటే త్వరలోనే అనౌన్స్‌‌మెంట్ వచ్చే అవకాశాలున్నాయి.