నిప్పుతో స్టంట్లు ..ఒళ్లంతా మంటలు 

నిప్పుతో స్టంట్లు ..ఒళ్లంతా మంటలు 

నిప్పుతో చెలగాటం అంటే మాములు విషయం కాదు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణం మీద ఆశలు వదులుకోవాల్సిందే. గుజరాత్ లో ఓ యువకుడు నిప్పుతో స్టంట్స్ చేసి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. సూరత్ లో బుధవారం రాత్రి గణేష్ చతుర్థి వేడుకల్లో ఒక యువకుడు అగ్నితో ఆటలాడేందుకు ప్రయత్నించి ప్రమాదానికి  గురయ్యాడు. పర్వత్ పాటియా ప్రాంతానికి చెందిన ఒక పూజ మండపం వద్ద  ఓ యువకుుడు నోటిలో ద్రవాన్ని పోసుకుని గాలిలోకి ఊదుతూ మంటలు పుట్టించాలనుకున్నాడు. అలా నోటి నుంచి ద్రవాన్ని ఊది మంట వెలిగించాడు. అయితే క్షణాల్లో ఆ మంట అతడి ఒళ్లంతా అంటుకుంది. అంతే అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. 

ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు సదరు వ్యక్తి మంటల్లో కనిపించాడు. పెద్దగా కేకలు వేయడంతో పక్కనున్న వాళ్లంతా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెట్టారు. కానీ ఓ కుర్రాడు అప్రమత్తమై మంటల్లో ఉన్న యువకుడి టీ షర్ట్ తొలగించాడు. దీంతో హహ్మయ్యా అంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడటంతో ఆ యువకుడు బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు మంటలకు సంబంధించిన వీడియోను  సెల్ ఫోన్ లో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అగ్నితో ఆటలాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు యువకులు డోంట్ కేర్ అంటున్నారు. ఇలాంటి సాహసాలు మళ్లీ చేయొద్దని సూచిస్తున్నారు.