
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. టీనేజ్ యువతిపై ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. కత్తితో దాడి చేసి కిరాతకంగా పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. తల, చేతులపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనతో ప్రొద్దుటూరు పట్టణంలో కలకలం రేగింది. పట్టణానికి చెందిన యువకుడు సునీల్ అదే ప్రాంతానికి చెందిన టీనేజ్ యువతి(17) వెంట పడుతున్నాడు. మూడు నెలలుగా ప్రేమించమంటూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు.
ఇటీవల ప్రేమించనని ఆమె సునీల్‌కు తెగేసి చెప్పడంతో కోపం పెంచుకున్నాడు. శుక్రవారం ఎవరూ లేని సమయంలో యువతి ఇంటికి వచ్చి కత్తితో ఆమెపై దాడి చేసి పరారయ్యాడు. దాడిలో యువతి చేతి వేళ్లు కొన్ని తెగిపోయాయి. స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మూడు నెలలుగా సునీల్ తమ కూతురిని వేధిస్తున్నట్లు యువతి కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.