వీడియో: ముక్కు మీద నుంచి మాస్క్ జారిందని ఆటో డ్రైవర్‌ను చితకబాదిన పోలీసులు

వీడియో: ముక్కు మీద నుంచి మాస్క్ జారిందని ఆటో డ్రైవర్‌ను చితకబాదిన పోలీసులు

దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది. దాంతో ఆయా రాష్ట్రాలు కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నాయి. అయితే ఈ నిబంధనలను ఎంత కఠినంగా అమలు చేస్తున్నారంటే.. ముక్కు మీద నుంచి మాస్క్ జారిపోయినా కూడా చితక్కొడుతున్నారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.  

కృష్ణ కేయర్ అనే 35 ఏళ్ల ఆటో డ్రైవర్.. ఆస్పత్రిలో ఉన్న తన తండ్రికి భోజనం తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో కృష్ణ కేయర్ వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. అయితే వీరు ఆస్పత్రికి వెళ్తున్న సమయంలో.. కృష్ణ మాస్కు ముక్కు మీద నుంచి కిందికి జారిపోయింది. అది గమనించిన పోలీసులు.. ఆటోను ఆపి.. మాస్కు ఎందుకు పెట్టుకోలేదని కృష్ణ కేయర్‌ను ప్రశ్నించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. అందుకు కృష్ణ.. తన తండ్రి ఆస్పత్రిలో ఉన్నాడని.. ఆయనకు భోజనం తీసుకెళ్తున్నానని చెప్పాడు. అందువల్ల పోలీస్ స్టేషన్‌కు రావడం కుదరదని చెప్పాడు. ఆగ్రహించిన పోలీసులు.. కృష్ణను ఆటో నుంచి కిందికి దించి రోడ్డుపై పడేసి చితక్కొట్టారు. ఆటోలో ఉన్న కృష్ణ కొడుకు.. తన తండ్రిని వదిలిపెట్టాలని పోలీసులను ఎంతగానో బతిమిలాడాడు. అయినా కనికరించని పోలీసులు.. కృష్ణను బూటు కాళ్లతో తన్ని విపరీతంగా కొట్టారు.

ఈ దాడి జరిగిన సమయంలో చుట్టూ ఉన్న వాళ్లు ఫోటోలు,వీడియోలు తీశారే తప్ప ఎవరూ ముందుకు వచ్చి పోలీసులను అడ్డుకోలేదు. ఆ విధంగా ఒక వ్యక్తి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఆ వీడియోలో ఉన్న పోలీసులు.. కమల్ ప్రజాపత్, ధర్మేంద్ర జాట్ అని గుర్తించి.. వారిద్దరినీ సస్పెండ్ చేశారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

https://twitter.com/GargiRawat/status/1379457967230230532