ఇండిగో ఫ్లైట్లో పాట్నా వెళ్లాల్సిన వ్యక్తి రాజస్థాన్లో ల్యాండ్ అయిండు

ఇండిగో ఫ్లైట్లో పాట్నా వెళ్లాల్సిన వ్యక్తి రాజస్థాన్లో ల్యాండ్ అయిండు

ఇండిగో విమానంలో పాట్నా వెళ్లాల్సిన వ్యక్తి పొరపాటున మరో ఫ్లైట్ ఎక్కి రాజస్థాన్ వెళ్లాడు. ఈ ఘటన గత నెల 30న చోటుచేసుకుంది. దీనిపై వివరణ ఇవ్వాలని డీజీసీఏ ఇండిగో ఎయిర్ లైన్స్ను ఆదేశించింది. అఫ్సర్ హుస్సేన్ అనే వ్యక్తి పాట్నా వెళ్లేందుకు ఇండిగో ఫ్లైట్ 6E 214 కు టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. అయితే అతను పొరపాటున ఇండిగోకు చెందిన మరో విమానం 6E 319 విమానం ఎక్కాడు. ఇది ఢిల్లీ నుంచి రాజస్థాన్ లోని ఉదయ్పూర్ వెళ్తుంది. ఉదయ్పూర్ ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత విషయం తెలుసుకున్న అఫ్సర్ వెంటనే అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇండిగో అతడిని అదే రోజు ఢిల్లీకి చేర్చి.. ఆ తరువాత రోజు పాట్నాకు తీసుకెళ్లింది.

ఈ ఘటనపై స్పందించిన డీజీసీఏ అధికారులు సదరు విమానయాన సంస్థపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రయాణీకుల బోర్డింగ్ పాస్ను ఎందుకు పూర్తిగా స్కాన్ చేయలేదని డీజీసీఏ ప్రశ్నించింది. నిబంధనల ప్రకారం బోర్డింగ్ పాస్లను బోర్డింగ్ కు ముందు రెండు పాయింట్ల వద్ద చెక్ చేసినప్పటికీ.. అతను తప్పుగా ఎలా ఎక్కాడు అనే విషయాలను డీజీసీఏ విచారిస్తోంది. దీనిపై ఇండిగో సైతం స్పందించింది. ప్రయాణికుడికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది.