దొంగతనం చేసిండు... దర్జాగా పడుకున్నడు

దొంగతనం చేసిండు... దర్జాగా పడుకున్నడు
  • తెల్లవారుజామున దొంగను గుర్తించి బంధించిన స్థానికులు

కోటగిరి, వెలుగు: పోలీస్​స్టేషన్​ వెనక గల్లీలో ఉన్న ఇంట్లో అర్ధరాత్రి ఆ దొంగ చోరీ చేశాడు. ఇంటికి బయటినుంచి తాళం వేశాడు. ఇంటి యజమాని బైక్​పైనే పరారయ్యేందుకు తాళం చెవి సైతం తీసుకున్నాడు. అంతలోనే అతనికి నిద్ర ముంచుకొచ్చింది. అంతే పక్కనే ఖాళీగా ఉన్న ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్​ వేసుకుని మరీ మస్తుగ నిద్రపోయిండు. తెల్లవారుజామున జనం గుర్తించి అతడిని బంధించారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా కోటగిరి మండలంలో చోటుచేసుకుంది. కోటగిరి పోలీస్‌‌స్టేషన్ వెనక గల్లీలో ఉన్న గంగాధర్​ ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఓ దొంగ చొరబడ్డాడు. ఇంట్లో ఉన్న  కొద్ది నగదు, గంగాధర్​ బైక్‌‌ తాళం చెవి తీసుకున్నాడు. ఇంటికి బయట నుంచి తాళం వేశాడు. ఇంతలో ఏమనిపించిందో కానీ ఆ ఇంట్లో నుంచి ఓ చాప, దిండు తీసుకుని పక్కనే ఖాళీగాఉన్న గంగాధర్​ తమ్ముడు శశివర్మ ఇంట్లోకి వెళ్లి ఫ్యాన్ వేసుకుని దర్జాగా పడుకున్నాడు. శనివారం ఉదయం ఐదింటికి లేచిన గంగాధర్​బయటకు వెళ్దామనుకుంటే గడి వేసి ఉంది. వెంటనే పక్కింటి వారికి ఫోన్ చేశాడు.

వారు వచ్చి తాళం వేసి ఉందని చెప్పడంతో ఇంట్లో ఉన్న మరో తాళం చెవిని వారికి ఇచ్చి తాళం తీయించాడు. అనంతరం దొంగలు ఏమైనా పడ్డారా అన్న అనుమానంతో ఇంట్లో పరిశీలించగా ప్యాంటులో ఉన్న నగదు పోయినట్లు తెలిసింది. ఇంతలో పక్కనే ఖాళీగా ఉన్న తమ్ముడి ఇంట్లో ఫ్యాన్ చప్పుడు రావటం గమనించారు. ఆ ఇంట్లోకి వెళ్లి చూడగా గుర్తుతెలియని వ్యక్తి పడుకుని కనిపించాడు. అతనే దొంగ అని అనుమానించి తాళ్లతో కట్టేశారు. రాత్రి కోటగిరిలో గణేశ్​ నిమజ్జనానికి బ్యాండ్ కొట్టడానికి వచ్చానని, నిమజ్జనం అయిపోయాక దొంగతనం చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడు. ఇంట్లో డబ్బును దొంగిలించిన తర్వాత బైక్ పై పారిపోదామనుకున్నానని, కానీ ఫుల్లుగా తాగి ఉండడంతో ఏమీ తోచక పక్కనే ఉన్న ఇంట్లో పడుకుండిపోయానని చెప్పాడు. దొంగతనానికి వచ్చి దర్జాగా పడుకున్న దొంగ విషయం  కోటగిరిలో చర్చనీయాంశంగా మారింది. స్థానికులు అతన్ని గట్టిగా అడగడంతో గతంలో కోటగిరి పోలీస్ స్టేషన్‌‌ ఎదురు గల్లీలో తన ఫ్రెండ్స్​తో కలిసి కొన్ని దొంగతనాలు చేసినట్లు ఒప్పుకొన్నాడు. స్థానికులు దొంగను పోలీసులకు అప్పజెప్పారు.