వాడి వేలు.. వాడే నరుక్కున్నాడు.. ప్రభుత్వాలకు నైవేధ్యంగా అంటూ వింత ప్రకటన

వాడి వేలు.. వాడే నరుక్కున్నాడు.. ప్రభుత్వాలకు నైవేధ్యంగా అంటూ వింత ప్రకటన

ఓ వ్యక్తి తన చూపుడు వేలును కత్తితో నరికేసుకుంటున్న వీడియో   ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఓ ప్లాస్టిక్ డబ్బాపై కూర్చున్న  ఓ వ్యక్తి..ముందు బండపై చూపుడు వేలును పెట్టి..కత్తితో నరికేసుకున్నాడు. అయితే అతను ఎవరు..ఎందుకు తన చూపుడు వేలును తానే నరికేసుకోవాల్సి వచ్చింది. అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. 

వివరాల్లోకి వెళ్తే..

వీడియోలో  చూపుడు వేలును నరికేసుకున్న వ్యక్తి పేరు ధనంజయ్ నానావరే. అతను మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ప్రతీ వారం తన శరీరంలోని ఓ భాగానే నరికేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు నైవేధ్యంగా సమర్పిస్తానని చెప్పాడు. కారణం ఏంటంటే ధనంజయ్ నానవరే సోదరుడు నందకుమార్ నానా వరే, అతని భార్య ఉజ్వల నానావరే ఆత్మహత్య కేసులో పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని..అందుకే తాను పోలీసులు, ప్రభుత్వ చర్యకు నిరసనగా..ఈ విధంగా చేస్తున్నట్లు వీడియోలో వివరించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

18 రోజులు గడిచినా చర్యల్లేవు..

తన సోదరుడు నందకుమార్, అతని భార్య ఉజ్వల ఆత్మహత్య కేసులో న్యాయం జరగకపోవడంతో ధనంజయ్ నానావరే మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే  ఆగస్టు 18వ తేదీన తన పౌల్ట్రీ ఫారానికి వెళ్లిన అతను..ఫోన్ లో వీడియో షూట్ చేశాడు. ఆగస్టు 1వ తేదీన తన సోదరుడు అతని భార్య కొందరి వల్ల ఆత్మహత్య చేసుకున్నారని..ఈ కేసులో తమకు న్యాయం జరగలేదని వీడియోలో ధనంజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన జరిగి 18 రోజులు దాటుతున్నా..ఇప్పటి వరకు పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధపడ్డాడు. ఈ కేసును వదిలేయాలని..తమపై ఒత్తిడి తెస్తున్నారని..కానీ మేమే న్యాయం జరిగే వరకు పోరాడతామని పేర్కొన్నాడు. 


నందకుమార్, ఉజ్వల ఎలా చనిపోయారంటే..

ధనంజయ్ నానావరే సోదరుడు నందకుమార్, అతని భార్య ఉజ్వల ఆగస్టు 1వ తేదీన తమ ఇంటిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నందకుమార్ నానావరే బీజేపీ ఎమ్మెల్యే పప్పు కలానీ దగ్గర పీఏగా పనిచేస్తు్న్నాడు. అలాగే అతను గతంలో శివసేన ఎమ్మెల్యే బాలాజీ కినికర్ వద్ద కూడా పనిచేశాడు. వీరిద్దరు ఆగస్టు 1వ తేదీన తమ ఇంటి పై నుంచి దూకి సూసైడ్ కు పాల్పడ్డారు. ఆ సమయంలో నందకుమార్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు. తాము ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నామని..అందుకు నలుగురు కారణమని వారి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు సూసైడ్ చేసుకున్న సమయంలో వీడియో కూడా తీశారు. 

దర్యాప్తు చేస్తున్నాం..

మరోవైపు నందకుమార్ ఉజ్వల ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని థానే డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ శివతాజ్ పాటిల్ తెలిపారు. ఈ కేసులో మృతుడి సూసైడ్ నోట్ లో పేర్కొన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. అంతేకాదు నందకుమార్ కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని కూడా సేకరించామని తెలిపారు. త్వరలో నిందితులకు సరైన శిక్ష పడుతుందని చెప్పుకొచ్చారు.