ఫారెస్టోళ్లు భూమి గుంజుకుంటున్నరని ఆత్మహత్యాయత్నం

ఫారెస్టోళ్లు భూమి గుంజుకుంటున్నరని ఆత్మహత్యాయత్నం

మెదక్ (కౌడిపల్లి), వెలుగు: తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లు గుంజుకుంటున్నరని మనస్తాపానికి గురైన పోడు రైతు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన జింక శ్రీశైలం తన తాతల కాలం నుంచి వచ్చిన నాలుగెకరాల పరంపోగు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఫారెస్ట్ ఆఫీసర్లు, గ్రామ సర్పంచ్ ప్రమీల భర్త సత్తయ్య వెళ్లి శ్రీశైలం వేసిన మిరప పంటను జేసీబీతో తొలగించారు. పంటను ఎందుకు తొలగిస్తున్నారని శ్రీశైలం అడిగితే.. ‘‘ఇది మీ భూమి కాదు. దీనిని ప్రకృతి వనం కోసం కేటాయించాం” అని చెప్పారు. తమ భూమి తీసుకోవద్దని బతిమలాడితే.. న్యాయం చేయాల్సిన సర్పంచ్ తమ సంగతి చూస్తానని బెదిరించాడని శ్రీశైలం తెలిపాడు.

తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. పురుగుల మందు తాగినట్టు వెల్లడించాడు. శ్రీశైలం తన పొలంలోనే సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి అతన్ని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నాడు. శ్రీశైలం తల్లి కంసమ్మ మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం భూమిని సాగుచేసుకోవచ్చని చెప్పిన ఫారెస్ట్ ఆఫీసర్లే.. ఇప్పుడు అదే భూమిని గుంజుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, శ్రీశైలం సాగు చేస్తున్న పొలం అటవీ శాఖదని ఫారెస్ట్ రేంజ్‌ ఆఫీసర్‌‌ రాజమణి అన్నారు. అతని కబ్జాలో ఉన్న భూమిలో కొంత మేర పంటలు వేసుకోవాలని , ఫారెస్ట్ భూమినే వదిలేయాలని చెప్పామని ఆమె అన్నారు.